Mithali Raj: 24 ఏళ్ల మిథాలీ క్రికెట్ కెరీర్.. ఎన్నో రికార్డులు, అవార్డులతో..
Mithali Raj: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్... సుదీర్ఘ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మహిళా క్రికెట్‌లో అనితర సాధ్యమైన రికార్డులతో హైదరాబాదీ మిథాలీరాజ్.. లేడీ సచిన్ గా గుర్తింపు పొందారు. 24 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన మిథాలీరాజ్... పలు రికార్డులు సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రికార్డు సైతం మిథాలీ పేరిటే ఉంది.
మిథాలీ రాజ్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో232 వన్డేలు ఆడి 7805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా ఉంది. వన్డేల్లో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు సాధించారు. అలాగే 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ ఫీట్ నమోదుచేశారు. మరోవైపు పొట్టి ఫార్మాట్ టీ ట్వంటీల్లో 89 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్.. 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అయితే మిథాలీరాజ్ తన ఆటతీరుతో మహిళా క్రికెట్‌కు గుర్తింపు తీసుకువచ్చింది. బాలికలు క్రికెట్‌ను ఎంచుకునే స్ఫూర్తి నింపారు. మిథాలీ కృషికి గుర్తింపుగా 2003లో అర్జున, 2015లో పద్మశ్రీ, 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది. మరోవైపు మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ మూవీ శభాష్ మీతూ రూపొందుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com