Andrew Symonds : మొన్న వార్న్.. నేడు సైమండ్స్ మృతితో క్రికెట్ ప్రపంచానికి షాక్..!
Andrew Symonds : ఆస్ట్రేలియన్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ హఠాన్మరణంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. మొన్నటికి మొన్న స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ చనిపోవడం, ఇప్పుడు సైమండ్స్ కూడా దూరం అవడంతో అభిమానులు షాక్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాలోని ట్రాన్‌విల్లేలో నిన్న రాత్రి పదిన్నరకు కార్ ప్రమాదంలో చనిపోయాడు సైమండ్స్. వేగంగా వెళ్తున్న సమయంలో సైమండ్స్ కారు బోల్తా కొట్టిందని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే సైమండ్స్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సైమండ్స్‌ను రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. కాని, తీవ్ర గాయాలైనందున కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
ఆండ్రూ సైమండ్స్ అనగానే.. హర్భజన్ సింగ్‌తో జరిగిన మంకీ గేట్ వివాదమే గుర్తుకొస్తుంది. 2008లో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్‌కు బౌలింగ్ చేస్తున్న సమయంలో సైమండ్స్ సీరియస్‌గా చూశాడు. ఆ సమయంలోనే తనను మంకీ అన్నాడంటూ సైమండ్స్ కంప్లైంట్ చేశాడు. అయితే, తాను మంకీ అనలేదు మా..కీ అన్నానంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న సచిన్ సైతం మా..కీ అనే మాట తానూ విన్నానంటూ మద్దతుగా నిలిచాడు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ఇవేమీ వినకుండా హర్భజన్‌పై చర్యలు తీసుకోవడంతో కెప్టెన్‌గా ఉన్న అనిల్ కుంబ్లే.. హర్భజన్‌పై నిషేధం ఎత్తేయకపోతే అసలు సిరీసే జరగదంటూ హెచ్చరించాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా దిగొచ్చింది. ఆస్ట్రేలియన్స్ నుంచి సైమండ్స్‌కు సపోర్ట్ లభించలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి క్రమంగా తాగుడుకు అలవాటయ్యాడు. ఈ మంకీ గేట్ వివాదం తరువాత సైమండ్స్ ఫామ్ కోల్పోయాడు. చివరికి జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.
సైమండ్స్ 14 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో 133 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా వరుసగా గెలిచిన మూడు ప్రపంచ కప్ టోర్నీల్లో సైమండ్స్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. టెస్ట్ కెరీర్‌లో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేసి, 24 వికెట్లు తీశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com