Ashes 2023: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
యాషెస్ సిరీస్‌లో ఆసీస్ బోణి కొట్టింది. టెస్టు మ్యాచ్ ఇంత రసవత్తరంగా ఉంటుందా అనేలా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లైయన్ జోడీ ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరానికొయ్యలా మారారు. కమిన్స్ 44, లైయన్ 16 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఆసీస్ టార్గెట్ 281 పరుగులు కాగా... చివరి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 107పరుగులతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనిస్తున్నట్టు కనిపించారు. కానీ చివర్లో కమిన్స్, లైయన్ జోడీ మొండిగా పోరాడడంతో విజయం కంగారూలనే వరించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజ వేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేయగా ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అయితే ఆసీస్ జట్టులో ఆటగాళ్లందరూ శక్తిమేర పోరాడడంతో ఇంగ్లండ్ కు పరాజయం తప్పలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com