Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ ఉన్నా అక్షర్‌ను ఆ ఫ్రాంచైజీ సారథిగా ఎంచుకుంది. కాగా, రాహుల్ తాను ఆటపై మరింత దృష్టిసారించేందుకు తనకు పగ్గాలు వద్దని ఢిల్లీ యాజమాన్యంతో చెప్పినట్లు సమాచారం. ఇక గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో రాహుల్‌ను రూ. 14 కోట్లకు డీసీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అంతకుముందు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్ కొనసాగాడు. అయితే, వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు పంత్ స్థానంలోనే డీసీ ఆల్ రౌండర్ అక్షర్‌ను సారథిగా నియమించింది.
కాగా, గత కొన్నేళ్లుగా ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్ కీలక ప్లేయర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2024 మే 12న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో అతను ఒకసారి డీసీకి నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 2024 ఐపీఎల్ సీజన్‌లో 36.40 సగటుతో 364 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో అతను 29.07 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.
ఇక మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను 24న ఆడనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో డీసీ తలడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com