IPL Auction 2022 : స్టార్‌ ప్లేయర్లకి ఝలక్.. యువ ఆటగాళ్లకు టాప్‌ రేట్‌..

IPL Auction 2022 : స్టార్‌ ప్లేయర్లకి ఝలక్.. యువ ఆటగాళ్లకు టాప్‌ రేట్‌..
IPL Auction 2022 : ఐపీఎల్‌-2022 మెగా వేలం అంచనాలను తలకిందులు చేస్తూ జరిగింది. 600మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. ఈసారి కొత్తగా మరో రెండు జట్లు ఐపీఎల్‌లోకి వస్తున్నాయి.

IPL Auction 2022 : ఐపీఎల్‌-2022 మెగా వేలం అంచనాలను తలకిందులు చేస్తూ జరిగింది. 600మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. ఈసారి కొత్తగా మరో రెండు జట్లు ఐపీఎల్‌లోకి వస్తున్నాయి. ఈ వేలంలో.. పలువురు స్టార్‌ ప్లేయర్లు అమ్ముడుపోకపోగా.. యువ ఆటగాళ్లు అనూహ్యమైన ధర పలికారు. తొలి సెట్‌ ఆక్షన్‌లో యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ టాప్‌ రేట్‌ పలికాడు. 15కోట్ల 25 లక్షలకు ఇషాన్‌ను.. ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

ఈసారి వేలంలో పేసర్లకు కాసుల వర్షం కురిసింది. దీపక్‌ చాహర్‌ను 14కోట్ల రూపాయల భారీ ధరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ చేజిక్కించుకుంది. శార్దుల్‌ ఠాకుర్‌ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 10కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. కివీస్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ను 10కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది. యువర్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను 10కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది. హేజిల్‌వుడ్‌ను 7కోట్ల 75 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా.. మార్క్‌వుడ్‌ను 7కోట్ల 50లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌ను సన్‌రైజర్స్‌ 4కోట్ల 20లక్షలకు దక్కించుకుంది.

గతేడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కొనసాగిన శ్రేయస్‌.. ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లోకి వెళ్లాడు. అతని కోసం కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ పోటీపడ్డా.. చివరకు కోల్‌కతా 12కోట్ల 25లక్షలకు సొంతం చేసుకుంది. మరోవైపు తొలిసెట్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, డేవిడ్‌ వార్నర్‌ తక్కువ ధర పలికారు. అశ్విన్‌ గత సీజన్‌లో ఢిల్లీ తరఫున 7కోట్ల 60లక్షలు ఖాతాలో వేసుకోగా.. ఈసారి రాజస్థాన్‌ 5 కోట్లకే కొనుగోలు చేసింది.

మరోవైపు సన్‌రైజర్స్‌ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ సైతం ఈ మెగా వేలంలో తక్కువ ధరనే పలికాడు. వార్నర్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ పోటీపడ్డా.. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 6.25 కోట్లకే దక్కించుకుంది. గత సీజన్‌లో వార్నర్‌ 11 కోట్లు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాడు హర్షల్‌ పటేల్‌కు అనూహ్యమైన ధర పలికింది. గత ఐపీఎల్‌లో బేస్‌ రేటుకే అమ్ముడుపోయిన హర్షల్‌ పటేల్‌.. ఈసారి ఏకంగా 10కోట్ల 75 లక్షల రూపాయల ధర పలికాడు. ఈ యువ ఆటగాడిని భారీ రేటుకు బెంగళూర్‌ టీమ్‌ దక్కించుకుంది.

సౌతాఫ్రికా పేసర్‌ రబాడను 9కోట్ల 25లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ కూడా మంచి ధరే పలికాడు. హోల్డర్‌ను 8 కోట్ల 75 లక్షలకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను 8కోట్ల 75లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. 8కోట్ల 25 లక్షలకు శిఖర్‌ ధావన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకోగా.. అదే ధరకు కునాల్‌ పాండ్యను లక్నో సొంతం చేసుకుంది.

ట్రెంట్‌ బౌల్ట్‌ను రాజస్థాన్‌ 8కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను 7కోట్ల 25లక్షలకు కోల్‌కతా దక్కించుకోగా, 7 కోట్లకు డుప్లెసిస్‌ను బెంగళూర్‌ కొనుగోలు చేసింది. 6కోట్ల 75 లక్షలకు డికాక్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంటే.. అంబటి రాయుడుని 6కోట్ల 75లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమిని 6కోట్ల 25లక్షలకు గుజరాత్‌ కొనుగోలు చేసింది. వీరితో పాటు టీమిండియా యువ ఆటగాళ్లు దీపక్‌ హుడాను 5కోట్ల 75 లక్షలు, మనీశ్‌ పాండేను 4కోట్ల 60 లక్షలకు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది.

ఐపీఎల్‌ మెగా వేలంలో పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. సురేశ్‌ రైనా, స్టీవ్‌స్మిత్‌, షకిబ్‌ ఉల్‌ హసన్‌, డేవిడ్‌ మిల్లర్‌ లాంటి స్టార్లు అమ్ముడుపోలేదు‌. ఐపీఎల్‌ టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఉన్న రైనా గతేడాది చెన్నై తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అంతకుముందు వరకూ ఏటా ఆ జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా రాణించినా.. చెన్నై ఈసారి అతడిని వదిలేసుకుంది.

అయితే వేలంలో జట్లు రైనా కోసం పోటీపడతాయని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ ఇటీవల ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడిపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ను సైతం ఎవరూ కొనుగోలు చేయలేదు. దక్షిణాఫ్రికా హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ సైతం గతేడాది రాజస్థాన్‌ జట్టులో విఫలమవడంతో.. ఈసారి ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story