చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్-2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క వికెట్ కోల్పోకుండా పంజాబ్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌నూ విడిచిపెట్టకుండా బౌండరీల మోత మోగించారు. 178 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మరో 14 బంతులు మిగిలుండగానే గెలుపు జెండా ఎగుర వేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు.. కేఎల్ రాహుల్ అర్థ సెంచరీతో రాణించగా.. పూరన్ 17 బంతుల్లో 33పరుగులతో చివరల్లో మెరుపులు మెరిపించాడు. దీంతో పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్కు 2 వికెట్లు దక్కగా.. రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలకు చెరో వికెట్ లభించింది. అనంతరం 179 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆది నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు వాట్సన్ 53 బంతుల్లో 83 పరుగులు, డూప్లెసిస్53 బంతుల్లో 87 పరుగులు పూనకం వచ్చినట్లు బౌండరీలు బాదేశారు. దీంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
ఈ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచ్‌లను అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మార్కును చేరాడు. కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ కొట్టి పట్టడంతో ధోని వంద క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఈ లీగ్‌లో అత్యధిక వికెట్ కీపర్ క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక్కడ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తొలి వికెట్ కీపర్ కాగా, ఆ తర్వాత ధోని దాన్ని సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com