Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ హవా
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం నమోదు చేసిన టీమిండియా మరో ఘనత సాధించింది. ఇప్పటికే వన్డేలు, టీ20లో టాప్ ప్లేసులో కొనసాగుతున్న భారత జట్టు తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఈ ఘనత సాధించింది. టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా ఆస్ట్రేలియా 111 పాయింట్లతో సెకండ్ ప్లేసులో కొనసాగుతోంది. ఇక 106 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది.
ప్రస్తుతం టీమిండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో 114 పాయింట్లతో ఫస్ట్ ప్లేసులో ఉండగా..టీ 20ల్లో 261 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. వన్డేల్లో 112 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా..టీ 20ల్లో ఇంగ్లండ్ రెండో ర్యాంకులో ఉంది.
టెస్టుల్లో బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ 846 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా 867 పాయింట్లతో ఆస్ట్రేలియన్ కెప్టెన్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమైన బుమ్రా ప్రస్తుతం 803 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా రెండో టెస్టు ఆడనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com