సీఎస్‌కేతో పోరాడిన సన్‌రైజర్స్‌.. చివరకు..

సీఎస్‌కేతో పోరాడిన సన్‌రైజర్స్‌.. చివరకు..

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరాడి గెలిచింది. సన్‌రైజర్స్‌ 164 పరుగుల స్కోరును కాపాడుకుని మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. సీఎస్‌కేపై 7 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలిచి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కేకు శుభారంభం లభించలేదు. వాట్సన్‌ విఫలం కాగా, ఆపై అంబటి రాయుడు, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. దాంతో సీఎస్‌కే 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

అటు తర్వాత ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజాలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. జడేజా 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించగా, ధోని 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. సామ్‌ కరాన్‌ 5 బంతుల్లో 2 సిక్స్‌లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకూ ఆసక్తిరేపిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండో వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, అబ్దుల్‌ సామద్‌లు తలో వికెట్‌ సాధించారు. ఈ విజయంతో రైజర్స్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆడిన 4 మ్యాచ్‌లలో మూడింట్లో ఓటమి పాలైన చెన్నై పాయింట్స్ పట్టికలో అట్టడుగు పడిపోయింది.

Tags

Next Story