HBD MS DHONI:హ్యాపీ బర్త్ డే ధోనీ..మహీకి క్రికెట్ లెజెండ్స్ గ్రీటింగ్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ సంచలనం. మిస్టర్ కూల్‌గా, టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా భారత క్రికెట్ కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ఘనత ధోనీకే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోని.. దాదాపు 17 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నాడు.
కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా టీమిండియా సాధించిన విజయాల్లో ధోనీ పాత్ర అద్వితీయం, అనితర సాధ్యం. భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన 41వ పుట్టిన రోజును ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బర్త్ డే సందర్భంగా ధోనీకి క్రికెట్ దిగ్గజాలు విషెస్ చెబుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. ధోనీ క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ పూర్తి కాదు. ధోనీ వంటి వ్యక్తిని కలిగి ఉండే అదృష్టం అన్ని జట్లకు ఉండదు. రత్నం లాంటి మనిషి, ఆటగాడు అయిన ఎంఎస్ ధోనీకి హ్యాపీ బర్త్ డే. ఓమ్ హెలికాప్టరాయనమహ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ధోనీ లాంటి నాయకుడిని చూడలేదు. భారత క్రికెట్ కోసం చేసిన కృషికి ధన్యవాదాలు. నా పెద్దన్నయ్యకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విరాట్ కొహ్లీ ట్వీట్ చేశాడు.
దాదా మాకు మ్యాచ్ ఎలా గెలవాలో నేర్పాడు, అలాగే ధోనీ మాకు మ్యాచ్ గెలవడం ఒక అలవాటుగా మార్చాడు. భారత క్రికెట్ కు ఒక రూపాన్ని ఇచ్చిన ధోనీకి హ్యాపీ బర్త్ డే అంటూ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.
ధోనీని అమితంగా ఇష్టపడే, అభిమానించే సురేశ్ రైనా ధోనీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. నా పెద్దన్నయ్యకు హ్యాపీ బర్త్ డే అంటూ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. నా జీవితంలోని ప్రతి దశలోనూ మార్గదర్శిగా ఉన్న, నా అతిపెద్ద మద్దతుదారుడికి ధన్యవాదములు. ఆ దేవుడి ఆశీస్సులతో నీవు, నీ కుటుంబం ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అని రైనా ట్వీట్ చేశాడు.
బీసీసీఐ కూడా ధోనీకి శుభాకాంక్షలు తెలియజేసింది. ఓ రూపం, ఓ స్ఫూర్తి అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ కు హ్యాపీ బర్త్ డే విషెస్ తో ట్వీట్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ సైతం ట్విట్టర్ వేదికగా ఎంఎస్ ధోనీకి బర్త్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com