Shane Warne: టెస్టుల్లో 10 సార్లు 10 వికెట్లు.. ఆ రికార్డు షేన్‌వార్న్‌కే సొంతం..

Shane Warne (tv5news.in)
Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ కన్నుమూశాడు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్.. తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ప్రాథమికంగా వైద్యులు పేర్కొన్నారు. వార్న్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లెజెండ్‌ను కోల్పోయామంటూ సంతాపాన్ని ప్రకటించింది.
క్రికెట్ ఆస్ట్రేలియాకు షేన్‌వార్న్ విశేష సేవలందించాడు. 1992లో జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్ ఆసీస్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. దాదాపు 15 ఏళ్లపాటు సేవలందించిన వార్న్ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆసీస్ తరపున మొత్తం 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు.
టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు తీయగా.. 10 సార్లు 10 వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్ వార్న్ రికార్డు సృష్టించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వార్న్ కంటే ముత్తయ్య మురళీధరన్ ముందున్నాడు. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఘనత షేన్ వార్న్‌కే దక్కుతుంది.
కెప్టెన్, మెంటార్‌గా ఆర్‌ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించి మరీ ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు పగ్గాలను చేపట్టడం విశేషం. ఇటు సీనియర్లు, యువ ఆటగాళ్లను సమతూకం చేసుకుంటూ రాజస్థాన్‌కు టైటిల్‌ను సాధించి పెట్టాడు. 2011 వరకు రాజస్థాన్‌కు సారథిగా వ్యవహరించాడు వార్న్. 1992 నుంచి 2007 వరకు ఆసీస్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు వార్న్. 1994లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్న షేన్ వార్న్.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో వాడిగా ఉన్నాడు.కెరీర్‌లో మొత్తం 145 టెస్టులు ఆడిన వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేలు ఆడి 293 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు షేన్ వార్న్ వీడ్కోలు పలికాడు. 2021లో కరోనా బారిన పడి తర్వాత కోలుకున్నాడు. షేన్‌వార్న్ హఠాన్మరణం ప్రపంచ క్రికెట్‌కు తీరని లోటంటున్నారు అభిమానులు. వార్న్ లేడనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com