India vs Pakistan: ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్..
India vs Pakistan (tv5news.in)
India vs Pakistan: ప్రపంచ్‌కప్ చరిత్రలో తొలిసారి భారత్ పై పాక్ విజయం సాధించింది. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భాగంగా దాయాదుల సమరంలో పాక్ జట్టు పై చేయి సాధించింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జట్టు పరాజయాన్ని మూటకట్టుకుంది. పాక్ జట్టు అన్ని విభాగాల్లో అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది.
టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారతజట్టు పరాజయాన్ని చవిచూసింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు ఆశించిన మేర రాణించకపోవడంతో ఓటమిని మూట కట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగుల చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ అర్థ సెంచరీలతో చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వరల్డ్‌కప్ టోర్నీ చరిత్రలో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాక్ జట్టుకు ఓపెనర్లు రిజ్వాన్ ,బాబర్ అజామ్ శుభారంభాన్ని అందించారు. మొదట్లో ఆచూతూచి ఆడిన వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు . ఈక్రమంలోనే వీరిద్దరూ అర్థసెంచరీలు చేశారు.
ఎక్కడ భారత్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా లక్ష్యం తతంగాన్ని పూర్తి చేశారు. దీంతో పాక్ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి భారత్ పై విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీంఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల ఖాత తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
మరో ఓపెనర్ రాహుల్ సైతం స్వల్ప స్కోర్‌కు ఔటవడంతో.. భారత్ 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు పెంచడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బ్యాట్ ఝళిపించిన పంత్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో షాదాబ్ ఖాన్ బౌలింగులో భారీ షాట్‌కు యత్నించి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా 13 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. దీంతో టీంఇండియా 152 పరుగుల విజయ లక్ష్యాన్ని ప్రత్యర్థి పాక్‌కు ముందుంచింది.
భారత జట్టు ఓటమి బాధించినప్పటికి.. ఆటలో జయాపజయాలు సాధారణమంటున్నారు టీమిండియా అభిమానులు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బాగా ఆడారని అన్నారు. భారత్ కొన్ని విభాగాల్లో విఫలమైనప్పటికి.. తిరిగి పుంజుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రారంభ మ్యాచ్ మాత్రమేనన్నారు. టీ20 ప్రపంచకప్ భారత్‌దేనిని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం మీద దాయాదుల పోరులో పాక్ భారత్‌పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా ప్రపంచకప్ టోర్నిని విజయంతో ప్రారంభించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com