పింక్‌బాల్ టెస్ట్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఆడలేక తంటాలు పడ్డ ఇంగ్లండ్

మొతేరా మోతెక్కిపోయింది. పింక్‌బాల్ టెస్ట్‌లో టీమిండియా అదరగొట్టింది. స్పిన్‌పిచ్‌పై ఆడలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తంటాలు పడ్డారు. అక్షర్ పటేల్, అశ్విన్ మళ్లీ రెచ్చిపోయారు. దీంతో రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది.. ఈ విజయంతో ICC ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ టాప్‌ప్లేస్‌లోకి చేరుకోగా...ఫైనల్ అర్హత రేసునుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది.
అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 81 పరుగులకే కుప్ప కూలింది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ సేన కేవలం 7. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లాంఛనం పూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మూడు వికెట్ల నష్టానికి 99 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన భారత్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా కెప్టెన్ జో రూట్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. 5 వికెట్లు సాధించి టీమిండియా పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరి జోరుకు.. 145 పరుగులకే ఆలౌట్ అయిన భారత్... కేవలం 33 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్షర్ పటేల్, అశ్విన్‌లను ఎదుర్కోవడంతో పూర్తిస్థాయిలో తడబడ్డ ఇంగ్లండ్.. కేవలం 30 ఓవర్లలో 81 పరుగులకే కుప్ప కూలింది. అక్షర్ పటేల్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా... సీనియర్ స్పిన్నర్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అతను టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా అవతరించాడు.
ప్రపంచంలో అతి పెద్దదైన మొతేరా స్టేడియంలో టెస్టు మ్యాచ్.... అందులోనూ డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టు అనే సరికి క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ స్పిన్నర్లకు స్వర్గధామంగా నిలిచిన ఈ స్టేడియంలో కేవలం ఒకటిన్నర రోజులోనే మ్యాచ్ ముగిసిపోయింది. రెండు జట్లలోనూ స్పిన్నర్లు చెలరేగడంతో... కేవలం 140 ఓవర్ల పాటు సాగిన ఆటలో 30 వికెట్లు నేలకూలాయి.
ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరేందుకు భారత్‌కు దాదాపుగా లైన్ క్లియర్ అయింది...ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి నిష్క్రమించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com