Rishabh Pant: రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి.. ఆలయంలో భారత క్రికెటర్లు ప్రార్థన
Rishab Panth: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మరియు చివరి వన్డే కోసం మధ్యప్రదేశ్‌లో ఉన్న కొంతమంది భారత క్రికెట్ జట్టు సభ్యులు సోమవారం ఉదయం ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహంకాళీ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.
క్రీడాకారులు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మరియు వాషింగ్టన్ సుందర్ సోమవారం తెల్లవారుజామున భారత క్రికెట్ జట్టు సిబ్బందితో కలిసి మహంకాళీ ఆలయానికి చేరుకున్నారు. తమ సహచరుడు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు స్టార్ బ్యాటర్ ఆఫ్ ఇండియా సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.
డిసెంబరు 30న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. "రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థించాము. అతడు తిరిగి జట్టులో పాల్గొనాలి. అతడి రాక మాకు చాలా ముఖ్యం. మేము ఇప్పటికే న్యూజిలాండ్‌తో సిరీస్ గెలిచాము. వారితో జరిగే చివరి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాము" అని సూర్యకుమార్ యాదవ్ జాతీయ మీడియాకు వివరించారు.
ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించిన శివుని భస్మ హారతిలో క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆటగాళ్లు సంప్రదాయ దుస్తులైన పంచె, కండువా ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో టీమిండియా చివరిదైన మూడో మ్యాచ్ ఆడనుంది.
శనివారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com