ఐపీఎల్ తొలి మ్యాచ్ అన్న ఆనందం కన్నా.. ఆయన ఆట చూసేందుకు ఆసక్తి..

కోట్లాది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ధనాధన్ పరుగుల పండుగకు రంగం సిద్ధమైంది.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ గ్రాండ్‌గా దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది.. కరోనా వైరస్ విజృంభణ.. లాక్‌డౌన్.. అన్‌లాక్‌డౌన్ అంటూ వినోదాలకు దూరమైన కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఎంటైర్ టైన్ చేసేందుకు కలర్ ఫుల్ క్రికెట్ సై అంటోంది. ప్రేక్షకుల కేరింత లేకపోయినా.. చీర్‌గాళ్స్ చిందు లేకున్నా.. సందడి చేసేందుకు మేం సై అంటున్నారు క్రికెటర్లు.. ధనాధన్ సిక్సర్లు.. రివ్వున ఎగిరే వికెట్లు.. మెరుపు క్యాచ్‌లతో అలరించేందుకు రెడీ అయిపోయారు.. అబుదాబిలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, హాట్ ఫేవరెట్ గతడేది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం ఆటకు.. పదునైన వ్యూహాలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి..
2008లో సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై పేరు తెచ్చుకున్నాయి. ధోనీ సారథ్యం లోని CSK ఖాతాలో మూడు టైటిళ్లున్నాయి. అలాగే ఆడిన పది సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరిందంటే సీఎస్‌కే నిలకడ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈసారి కీలక ఆటగాళ్లు రైనా.. హర్భజన్ దూరం కావడం వారిని ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితులను కెప్టెన్ మహీ ఎలా అధిగమిస్తాడన్నది ఆసక్తికరమే. ఇక నాలుగు టైటిళ్లతో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. రోహిత్ శర్మ నేతృత్వం.. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడం వారికి కలిసి రానుంది.
తొలి మ్యాచ్ జరుగుతున్నాది అన్న ఆనందం కన్నా.. ధోనీ ఆట చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నది అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పిన తరువాత.. ధోనీ ఆట ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. CSKకి అన్నీ తానై నడిపించే ఎంఎస్ ధోనీ ఎప్పటిలాగే కొండంత బలం కానున్నాడు. ఈసారి ఎలాంటి ఒత్తిడీ లేకపోవడంతో అతడి బ్యాట్ మరింత గర్జించే అవకాశం ఉంది. దేశీ, విదేశీ ఆటగాళ్లు కూడా అపార అనుభవజ్ఞులు. వాట్సన్, డుప్లెసి, రాయుడు, మురళీ విజయ్, కేదార్ జాదవ్, జడేజా, బ్రావోలతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. చెన్నై ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. తాహిర్, పీయూష్ చావ్లా, జడేజా, కరణ్ శర్మ రూపంలో వారికి చక్కటి వనరులున్నాయి.
గతేడాది రోహిత్ బ్యాటింగ్ పరంగా ఆకట్టుకోకపోయినా అద్భుత నాయకత్వంతో ముంబై జట్టును నడిపించాడు. ఈసారి అతను బ్యాట్‌ను కూడా ఝుళిపిస్తే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే. హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ జట్టులో చేరడం అదనపు బలం. రోహిత్‌కు జతగా డికాక్, లిన్‌లలో ఒకరు ఓపెనింగ్‌లో రానున్నారు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, పొలార్డ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీస్కోర్లు నమోదయ్యే చాన్సుంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ గతేడాది ఫామ్ చాటుకున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, ధవల్ కులకర్ణి, బౌల్ట్, కల్టర్‌నైల్ ఉన్నారు.
ఈసారి ఐ.పి.ఎల్ కాస్త కొత్తగానే కనిపించనుంది. మనం ఎప్పుడు అభిమానుల సందడి లేని క్రికెట్ చూడలేదు. తొలిసారి అలాంటి అనుభూతి లేకుండానే మ్యాచ్‌లు జరుగుతున్నాయి.. ఆటగాళ్లంతా బయోబబుల్ వాతావరణంలోనే గడిపి మైదానంలోకి అడుగుపెడుతున్నారు.. అయితే క్రికెటర్లందరన్నీ ఇంకా కరోనా భయం వెంటాడుతుంది అనడం ఎలాంటి సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com