అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్..

కోల్‌కతా ప్లేఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. అనంతరం ఛేదకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 131 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టును కమిన్స్ ఘోరంగా దెబ్బతీశాడు. బట్లర్ టాప్ స్కోరర్.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కమిన్స్ ధాటికి అయిదు ఓవర్లలో 37 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో అత్యంత భారీ తేడాతో కోల్‌కతా విజయం సాధించి నేరుగా ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేరుకుంటుందని భావించారంతా. కానీ బట్లర్, రాహుల్ తెవాతియా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరు కలిసి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బట్లర్, తెవాతియాని వరుణ్ చక్రవర్తి ఔట్ చేసి మరోసారి ఆ జట్టును దెబ్బతీశాడు. కానీ శ్రేయస్ గోపాల్ పట్టుదలతో ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును ఆలౌట్ కాకుండా కాపాడాడు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ నాలుగు, శివమ్ మావి, చక్రవర్తి చెరో రెండు, నాగర్‌కోటి ఒక వికెట్ తీశాడు.
ఘోర పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే టాప్-4 రేసులో కోల్‌కతా నిలవాలంటే దిల్లీ×బెంగళూరు, ముంబయి×హైదరాబాద్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ పరాజయాన్ని చవిచూస్తే కోల్‌కతా 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ వార్నర్‌సేన విజయం సాధిస్తే దిల్లీ×బెంగళూరు మ్యాచ్‌లో ఓటమిపాలయ్యే జట్టు నెట్‌రన్‌రేటు ఆధారంగా కోల్‌కతాకు అవకాశం ఉంటుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com