ఐపీఎల్ లో అన్ని జట్టుల బలాలు..బలహీనతలు ఇవే!
ధనాధన్ బౌండరీలు.. ఆకాశాన్ని అంటేలా భారీ సిక్సర్లు.. క్షణాల్లో ఎగిరి పడే వికెట్లు.. మెరుపు క్యాచ్‌లు.. ఇలా ఐ.పి.ఎల్ అంటే ఓ కలర్‌పుల్ ఫీస్ట్. అయితే ఈ సారి అన్ని జట్లు కాస్త బలం పుంజుకున్నాయి. గత రికార్డులు ఎలా ఉన్నా.. ఈ సారి దుబాయ్ వేదికగా కప్ కొట్టేందుకు సై అంటున్నాయి.. టోర్నీలో ఎన్ని జట్లు ఉన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ 12 సీజన్లు జరిగింది. నిషేధం వేటుపడ్డ రెండేళ్లను తొలగిస్తే చెన్నై 10 సార్లు ఆడింది. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఏకంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అంటే ఎనిమిదిసార్లు సీఎస్‌కే ఫైనల్ ఆడింది. ఇలాంటి రికార్డు మరే జట్టుకూ లేదు. లీగ్‌లో చెన్నై 165 మ్యాచులు ఆడగా 100 విజయాలు సాధించింది. 64 మ్యాచుల్లో ఓడింది. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు.
ఇక ముంబై ఇండియన్స్ ఐ.పి.ఎల్ రారాజుగా కొనసాగుతోంది. ఐదుసార్లు ఫైనల్‌కు వెళ్తే ఆ జట్టు నాలుగుసార్లు ట్రోఫీ సొంతం చేసుకుంది. అన్నీ రోహిత్ శర్మ సారథ్యంలో సాధించినవే.. లీగ్‌లో అత్యధిక మ్యాచులాడిన ఘనత ముంబయి సొంతం. 2013, 2015, 2017, 2019 సీజన్లలో టైటిల్ కొట్టేసింది. 2010లో రన్నరప్. ఐపీఎల్‌లో 187 మ్యాచులాడిన ముంబయి 109 గెలిచి 78 ఓటమిపాలైంది. విజయాల శాతం 58 ఉంది. ఇప్పటి వరకు ఏడుగురు ఆటగాళ్లు సారథ్యం వహించారు. అయితే అందులో రోహిత్ సారథ్యంలో జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది.
మన హైదరాబాద్ జట్టు ఈ సారి కాస్త బలహీనంగానే కనిపిస్తున్నా.. తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ముఖ్యంగా ధనాధన్ ధావన్ దూరం కావడం కాస్ల లోటే అని చెప్పాలి. 2016లోనే విజేతగా నిలిచిన ఆ జట్టు.. 2018లో షేన్ వాట్సన్ మెరుపుల వల్ల త్రుటిలో టైటిల్ కోల్పోయింది. లేదంటే రెండోసారీ ట్రోఫీ ముద్దాడేదే. ఐపీఎల్‌లో అత్యంత బలమైన బౌలింగ్ వనరులున్న జట్టు హైదరాబాద్. ఇక బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విలియమ్సన్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ఆధారపడ్డ బ్యాట్స్‌మెన్ లేకపోవడం మైనస్సే.. ఇప్పటి వరకు 108 మ్యాచుల్లో తలపడ్డ ఎస్‌ఆర్‌హెచ్ 57 గెలిచి 49 ఓడింది. 2 మ్యాచులు టై. విజయాల శాతం 53 ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ను కూడా తక్కువ అంచనా వేయలేం.. మొదట గౌతం గంభీర్ సారథ్యంలో ఆ జట్టు అత్యుత్తమ దశను చూసింది. 2012, 2014లో ట్రోఫీ గెలుచుకుంది. మరోసారీ టైటిల్ గెలిచే సత్తా ఉన్నా కీలక సందర్భాల్లో దెబ్బతింటోంది. లీగ్‌లో 178 మ్యాచులాడిన కోల్‌కతా 92 గెలిచి 86 ఓడింది. విజయాల శాతం 52 ఉంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న జట్లలో కేకేఆర్ ఒకటి. ఆండ్రూ రసెల్, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్, కమిన్స్ వంటి ఆటగాళ్లు జట్టుకు అండగా ఉన్నారు.
ఐపీఎల్ అరంగేట్రం ట్రోఫీని ముద్దాడి సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాయల్స్. తరువాత ఎప్పుడు ఆ స్థాయి ఆట ప్రదర్శించలేదు. రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్ చేరుకుంది. రెండేళ్ల నిషేధం కూడా ఎదుర్కొంది. స్టీవ్‌స్మిత్, సంజు శాంసన్, జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్లు ఇప్పుడు జట్టులో ఉన్నారు. వార్న్ నేతృత్వంలోని కోచింగ్ బృందమూ బలమైందే.
జట్టు నిండా స్టార్లు ఉన్నా.. ఒక్క టైటిల్ కూడా నెగ్గని జట్టు రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్.. ఛేదన రారాజు విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ వంటి గొప్ప ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఒకప్పుడు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ ఉండేవారు. 2016, 2009లో రన్నరప్‌గా నిలవడమే బెంగళూరు అత్యుత్తమ ప్రదర్శన. 2016లో త్రుటిలో ఓటమి పాలైంది. హైదరాబాద్ బౌలింగ్ దాడి బలంగా లేకుంటే కచ్చితంగా గెలిచేదే!.. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలని కోహ్లీ సేన కసితో బరిలో దిగుతోంది..
పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు కెప్టెన్లు మారుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు 12 మంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహించారు. ఐపీఎల్‌లో ఒకే ఒక్కసారి రన్నరప్‌గా నిలవడమే ఆ జట్టు గొప్ప ప్రదర్శన. విధ్వంసకర హిట్టర్లున్న ఆ జట్టు 2014లో తప్ప ఎప్పుడూ దీటైన ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌పైనే ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. అతడినే నాయకుడిగా ఎంచుకుంది.
యువతనే నమ్ముకుని ముందుకు వెళ్తున్ జట్టు ఢిల్లీ.. ఇప్పటి వరకు ఒక్కసీజన్‌లో కూడా ప్రభావం చూపించని జట్టు ఢిల్లీ ఒక్కటే. జట్టు ఎప్పుడూ అట్టడుగు స్థానంతో సరిపెట్టుకొనేది. రెండేళ్ల క్రితం ఆ జట్టులో కీలక మార్పులు చేశారు. నాయకత్వ బృందాన్ని పటిష్ఠం చేశారు. గతేడాది దాదా, రికీ, కైఫ్ వంటి అనుభవజ్ఞుల వ్యూహాలతో ప్లేఆఫ్ చేరుకుంది. ఈ సారి పంత్, శ్రేయస్, ధావన్, అశ్విన్, రహానె స్టార్లున్న ఢిల్లీపై భారీ అంచనాలే ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com