KKRvsLSG: ఫలించని రింకూ పోరాటం ..ఒక్క పరుగు తేడాతో లక్నో విజయం

ఐపీఎల్ లో మరోసారి ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. కోల్ కతా ఆటగాడు రింకూ సింగ్ మరోసారి విధ్వంసక ఆటతీరుతో భయపెట్టినా, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో నెగ్గి, ప్లే ఆఫ్ దశలో మూడో బెర్తును కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం, 177 పరుగుల లక్ష్యఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో కోల్ కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా, రింకూ సింగ్ రెండు సిక్స్ లు, ఒక ఫోర్ బాది తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు.
అయితే బౌలర్ యశ్ ఠాకూర్ ఆ ఓవర్లో కొన్ని అద్భుతమైన బంతులు విసరడంతో రింకూ శ్రమ వృథా అయింది. మొత్తమ్మీద రింకూ సింగ్ తన ప్రతిభ గాలివాటం కాదని మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్ లో అతడు 33 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రింకూ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
అంతకుముందు, కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాసన్ రాయ్ 45, వెంకటేశ్ అయ్యర్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ నితీశ్ రాణా 8, రహ్మనుల్లా గుర్బాజ్ 10, ఆండ్రీ రస్సెల్ 7 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్‌కు చెరో రెండు వికెట్లు దక్కగా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com