పెళ్లైన పదహారేళ్లకు 'కపిల్ దేవ్' జీవితంలో చిగురించిన ప్రేమ..
క్రికెట్‌లో అతడు హీరోనే కావచ్చు. క్రీడా మైదానంలో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయొచ్చు. అది ఆట వరకే.. తాను ఇంటికి వస్తే ఆడుకోవడానికి తనకీ ఓ పాపో, బాబో ఉంటే బావుండనుకున్నాడు. కానీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న రోమీ, కపిల్ దేవ్‌లకు పెళ్లైన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆ బాధ అనుక్షణం వేధించేది దంపతులిద్దరినీ.. ఆస్పత్రుల గుమ్మాలు ఎక్కీదిగీ అలసిపోయారు. ఆశలు వదిలేసుకున్నారు..
దేవుడు కరుణిస్తే పిల్లలు పుడతారు లేదంటే నాకు నువ్వు.. నీకు నేను అని ఓ నిర్ణయానికి వచ్చేశారు వారిరువురు. కానీ ఆశ్చర్యంగా ఆ మరుసటి ఏడాది ఏ ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే వారికి పెళ్లైన 16 ఏళ్లకు పండంటి పాపాయి పుట్టింది. ఆమెకు అమియా దేవ్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మొన్నటికి మొన్న నాన్నకు యాంజియోప్లాస్టీ జరిగితే అన్నీ తానై చూసుకుంది. సోషల్ మీడియాలో తండ్రిని యాక్టివ్ పార్ట్ చేసింది.
1996లో పుట్టిన అమియా తండ్రిని 'దాదా' అని పిలిచిన మొదటి పిలుపులోని కమ్మదనం ఇంకా తన చెవుల్లో వినిపిస్తూనే ఉందంటూ అమియాను చూసి మురిసిపోతారు కపిల్. నేను క్రికెట్ ఆటలో పూర్తిగా నిమగ్నమైన రోజుల్లో అమియా పుట్టి ఉంటే ఆ ఆనందాన్ని కోల్పోయేవాడిని.. రిటైర్ అయ్యాక పుట్టడంతో అమియా ప్రతి కదలికనీ ఆస్వాదించాను. పని పూర్తి చేసుకుని ఇల్లు చేరుకున్నప్పటు కూతురు ఎదురొస్తే ఏ తండ్రికైనా ఎంత ఆనందమో కదా అంటారు కపిల్. తల్లిదండ్రులిద్దరు అమియాపై తమ అభిప్రాయాలు రుద్దకుండా తన నిర్ణయాలు తనే తీసుకునేలా పెంచి పెద్ద చేశారు. ప్రాథమిక చదువు గుర్‌గావ్‌లో చదివించారు. పై చదువులకు లండన్ పంపించారు. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దే ఉన్న అమియా తండ్రి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని హ్యాండిల్ చేస్తోంది.
బాలీవుడ్‌లో పని చేయాలన్న అమియా కోరిక తండ్రి క్రికెట్‌లో వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన కథ 83 తో తీరింది. ఈ చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ఇలా ఒక క్రీడాకారుడి జీవితంపై వస్తున్న చిత్రానికి ఆ క్రీడాకారుని కుమార్తె పని చేయడం బహుశా ఇంత వరకు ఎక్కడా జరగలేదనే చెప్పాలి. తండ్రి బాడీ లాంగ్వేజ్‌ను ఆ పాత్ర పోషిస్తున్న రణ్‌వీర్ సింగ్‌కు చెప్పడానికి అమియా తోడ్పడింది.
అక్టోబర్ 22 రాత్రి తండ్రి గుండెపట్టుకుని అమ్మా.. అమియా నాకు ఛాతిలో నొప్పిగా ఉంది తల్లీ అని చెప్పడంతో వెంటనే డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని హుటాహుటిన దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కి నాన్నని తరలించింది. డాక్టర్లు అతడి పరిస్థితిని గమనించి తెల్లారే సరికి యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయన కోలుకున్నారు. అప్పటి వరకు తండ్రి పక్కనే ఉంది. ఆయన ఆరోగ్యంగా కోలుకుని ఇంటికి చేరుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంది నాన్న కపిల్ దేవ్‌ని. అందుకేనేమో నా హృదయం పదిలంగా పదికాలాల పాటు ఉంటుంది నా కూతురు నా పక్కన ఉంటే అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com