అదరహో కేకేఆర్‌..

అదరహో కేకేఆర్‌..
X

ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోల్‌కతా అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌‌.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల చేతిలో తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ , మోర్గాన్‌ మెరిశారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.

ఛేదనకు దిగిన రాజస్థాన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి కోల్‌కతా బౌలర్లు దెబ్బతీశారు. బట్లర్ ఆదిలో మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన రెండో ఓవర్‌లోనే సారథి స్మిత్ ను కమిన్స్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి, నాగర్‌కోటి, చక్రవర్తి తలో రెండు వికెట్లు, కమిన్స్‌, కుల్‌దీప్‌, నరైన్‌ తలో ఒక్క వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ సునీల్ నరైన్‌ మరోసారి నిరాశ పరిచాడు. ఉతప్ప ఇచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరోవైపు గిల్ మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్‌ ఔటైన తర్వాత నితీశ్‌ రాణా తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు. అయితే తెవాతియా వేసిన 10వ ఓవర్‌లో రాణా పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే గిల్‌ కూడా ఆర్చర్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రాయల్స్ జట్టులో టామ్ కుర్రాన్ 54, బట్లర్ 21 పరుగులు చేసి టాప్ స్కోర్లుగా నిలిచారు. నైట్ రైడర్స్ బౌలింగ్‎లో శివం మావి, కమలేశ్, చక్రవర్తికి తలా రెండు వికెట్లు దక్కగా, కమీన్స్, నరేన్, కుల్దీప్‎లు తలో వికెట్ తీశారు.

Tags

Next Story