ఐపీఎల్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన ముంబయి

ఐపీఎల్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన ముంబయి

ఐపీఎల్‌లో ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన దిల్లీకి పేలవ ఆరంభం దక్కింది. బౌల్ట్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌, శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత బౌండరీల మోత మోగించింది. ఈ క్రమంలో పంత్‌ 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి.. పెవిలియన్‌కు చేరాడు. శ్రేయస్‌-పంత్‌ 96 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హెట్‌మైయర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మరోవైపు... శ్రేయస్ అయ్యర్‌ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ మూడు, కౌల్టర్‌నైల్ రెండు, జయంత్ ఒక వికెట్ తీశారు.

అనంతరం.. ఛేదనకు దిగిన ముంబయికి మెరుపు ఆరంభం లభించింది. డికాక్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. రోహిత్ ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయిదో ఓవర్‌లో డికాక్‌ను స్టాయినిస్‌ బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ 20 బంతుల్లో19 రన్స్‌ చేశాడు. పవర్‌ప్లేలో ముంబయి 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్‌ స్పిన్నర్లకు బంతి అందించడంతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసర పరుగుకు రోహిత్‌ ప్రయత్నించగా.. సూర్యకుమార్ కెప్టెన్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కూడా మెరవడంతో ముంబయి విజయం దిశగా సాగింది. రోహిత్‌, పొలార్డ్‌ స్వల్పవ్యవధిలోనే ఔటైనా ఇషాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. దిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, రబాడ, స్టాయినిస్‌ చెరో వికెట్ తీశారు.

Tags

Read MoreRead Less
Next Story