Riyan Parag:: సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్ విక్టరీ

గత కొంత కాలంగా దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న అస్సాం కుర్రాడు రియాన్ పరాగ్ మెరుపులకు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఐపీఎల్ -17 సీజన్‌లో రాజస్థాన్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌ను 12 పరుగుల తేడాతో గెలుచుకుంది.
క్యాపిటల్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (5), జాస్ బట్లర్ (11), సంజూ శాంసన్ (15) విఫలమయ్యారు. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (19 బంతుల్లో 29)తో కలిసి యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 45 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో ధ్రువ్ జురెల్ 122 బంతుల్లో 20 రన్స్, షిమ్రాన్ హిట్ మెయర్ 7 బంతుల్లో 14తో రాణించారు. అయితే, రియాన్ పరాగ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చివేశాడు.
ఛేదనలో ఢిల్లీ.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా ట్రిస్టన స్టబ్స్ (23 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు,3 సిక్సర్లు) ఆఖర్లో పోరాడాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పరాగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఈ సీజన్‌లో తొలి మ్యాచులో లక్నోను ఓడించిన రాజస్థాన్.. ఢిల్లీపై విజయంతో వరుసగా రెండు మ్యాచులో గెలుపొందింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయింది. తొలి మ్యాచులో ఆ జట్టు పంజాబ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com