ROHIT SHARMA ON KOHLI: కోహ్లీ ఫామ్‌పై రోహిత్ శర్మ రియాక్షన్..!
గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి అభిమానులను నిరాశపరుస్తున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన T20 సిరీస్‌లోనైనా ఇరగదీస్తాడని అటు అభిమానులతో పాటు ఇటు టీమ్ ప్లేయర్స్ అందరూ భావించారు. కానీ అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ సిరీస్ రెండో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మూడో మ్యాచ్‌లో మొదట్లో 4, 6 కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 12పరుగులే చేయడంతో అభిమానులు మళ్లీ నిరుత్సాహపడ్డారు. దీంతో విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తు్న్నాయి. చాలా మంది సీనియర్లు విరాట్ కు విశ్రాంతి కల్పించాలని సూచిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని సూచించాడు.
అయితే కోహ్లీ ఫామ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతాడని.. ఆ తర్వాత పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వస్తాడని కోహ్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఆటగాడి నాణ్యత ఎప్పుడూ తగ్గదని.. కోహ్లీ ఫామ్‌కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని రోహిత్ సూచించాడు. తాను కూడా ఓ దశలో ఫామ్ ను కోల్పోయానని గుర్తు చేశాడు.
బయటివారు ఏదేదో మాట్లాడుతుంటారని.. వారి విమర్శలను తాము పట్టించుకోమని చెప్పాడు. అసలు నిపుణులు ఎవరో.. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. వారు బయట నుంచి చూస్తూ విమర్శలు చేస్తున్నారని.. టీమ్‌ఇండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదని బదులిచ్చాడు. తామంతా కలిసి ప్రపంచకప్ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకుంటున్నామని..యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని చెప్పాడు. ఆ విషయాలన్నీ బయట వారికి తెలియవని రోహిత్ సమాధానమిచ్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com