Rohit Sharma: 45 నెంబర్ జెర్సీ ఆమె కోసమే: రోహిత్ శర్మ
Rohit Sharma (tv5news.in)
Rohit Sharma: రోహిత్ శర్మ.. తన అభిమానులు ముద్దుగా పిలుచుకునే హిట్ మ్యాన్. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన రోహిత్.. ఎప్పుడూ వెనుదిరగకుండా ఆడేవాడు. అలాగే తన డబుల్ సెంచరీలతో అభిమానులను కూడా పెంచుకున్నాడు. ఏ క్రికెటర్ ఫ్యాన్ అయినా తమ అభిమాన క్రికెటర్ హాఫ్ సెంచరీ చేస్తే చాలు.. సెంచరీ చేస్తే చాలు.. అనుకుంటారు. కానీ రోహిత్ శర్మ ఫ్యాన్ మాత్రమే తన నుండి ఎప్పుడు డబుల్ సెంచరీని ఆశిస్తూ ఉంటాడు. ఆయన డబుల్ సెంచరీకి ఉన్న క్రేజ్ అలాంటిది.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ ద్వారా రోహిత్ శర్మ ఖాతాలోకి మరో రికార్డ్ వచ్చి చేరింది. ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నిరాశే మిగిలినా.. ఆఫ్గనిస్తాన్‌తో ఆడిన ఆటలో మాత్రం రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ కలిసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. అందుకే ఆరోజు ఆడిన ఆటకు రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా దక్కింది. కానీ టీమ్ గెలవాలంటే అందరూ ఆడాలి కానీ ఒక్కరి స్కోర్‌పైనే టీమిండియా విన్ ఆధారపడదు అంటున్నాడు రోహిత్.
ఇక టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సాధించిన రికార్డ్ విషయానికొస్తే.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ముగిసే సమయానికి టీ20 క్రికెట్‌లో మూడు వేల పరుగులు తీసిన మూడవ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు రోహిత్. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ముందుగా 3227 పరుగులతో కోహ్లీ ఉండగా రెండో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ 3115 పరుగులతో ఉన్నాడు.
ఇప్పటివరకు టీ20ల్లో ఎవరూ నాలుగు సెంచరీలు చేయలేదు. అలా చేసిన మొదటి ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డ్ నిలిచిపోనుంది. రోహిత్ సాధించిన రికార్డుల విషయం పక్కన పెడితే.. విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఇకపై రోహిత్ కెప్టెన్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఎప్పటినుండో రోహిత్ ఫ్యాన్స్ ఎదురుచూసింది కూడా తమ అభిమాన ఆటగాడిని టీమిండియా కెప్టెన్‌గా చూడాలనే.
క్రికెట్ ఫ్యాన్స్‌కు తమ ఫేవరెట్ ప్లేయర్ జెర్సీ నెంబర్ కూడా ప్రత్యేకమే. అయితే రోహిత్ శర్మ తాను క్రికెటర్‌గా ఆట మొదలుపెట్టినప్పటి నుండి 45 నెంబర్ జెర్సీలోనే ఆడుతున్నాడు. నెంబర్ 45 ఎందుకని ప్రశ్నించగా.. అది తన అమ్మకు ఇష్టమైన నెంబర్ అని, టీమ్‌లో చేరినప్పుడు అదే నెంబర్ తీసుకోమని వాళ్ల అమ్మ సూచిస్తేనే తీసుకున్నానని గుర్తుచేసుకున్నారు రోహిత్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com