ఈసారి ఐపీఎల్ మజా చూపించిన 'దాదా'

ఈసారి ఐపీఎల్ మజా చూపించిన దాదా

సౌరబ్ గంగూలీ.. ఒకప్పుడు టీమిండియా హాట్ ఫేవరేట్.. క్రికెట్ అభిమానులు అమితంగా ఇష్టపడే ఆటగాడు.. గంగూలీని ముద్దుగా 'దాదా' అని పిలుచుకునేవారు. సాక్షాత్తు ఇష్టమైన ప్లేయరే బీసీసీఐ అధ్యక్షుడైతే ఇంకేముంది పండగే కదా.. అభిమానులు ప్రస్తుతం ఇదే త్రిల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ లో ఐపీఎల్ కున్న క్రేజే వేరు.. ఏటా ఐపీఎల్ మహాసంగ్రామం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కరోనా పుణ్యమాని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది. అసలిఏడాదీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనే ప్రశ్న కూడా తలెత్తింది.. ఒకానొక దశలో ఐపీఎల్ రద్దవుతుందన్న ప్రచారం కూడా జరిగింది. దాంతో క్రికెట్ అభిమానులు మీమాంసలో ఉండిపోయారు. ఈ తరుణంలో గంగూలీ చొరవ వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్వతహాగా క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ నుంచే బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరింతగా కలిసి వచ్చింది.

ఐపీఎల్ ద్వారా కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున బోర్డులో కొందరు సభ్యులు ఈ ఏడాది ఐపీఎల్ ను రద్దు చేయాలనీ ప్రతిపాదన తీసుకువచ్చారు.. అయితే గంగూలీ మాత్రం దీనిని ఆమోదించలేదు. ఎలాగైనా జరిపి తీరాలని ఫిక్స్ అయ్యారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా లైవ్ ప్రసారాల ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కేంద్ర హోమ్ శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి అనుమతులు తీసుకువచ్చారు. దాంతో గంగూలీ అనుకున్నట్టే దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 ప్రారంభం అయింది. కరోనా కారణంగా ప్రజలు ఎక్కువమంది ఇళ్ల వద్ద ఉండటం వల్ల ఐపీఎల్ కు పెద్దఎత్తున ఆదరణ లభించింది. ఈసారి ఐపీఎల్ ఉండదు అనుకున్న తరుణంలో గంగూలీ చొరవ.. క్రీడాభిమానులకు కరోనా సమయంలో కూడా ఐపీఎల్ మజాను ఆస్వాదించేలా చేసింది.. ఈ సందర్బంగా దాదాకు క్రికెట్ ప్రేక్షకులు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.

Tags

Next Story