Under 19 World Cup India: సత్తా చాటుకున్న యంగ్ ఇండియన్ క్రికెట్ టీమ్.. అయిదోసారి వరల్డ్ కప్..

Under 19 World Cup India: అండర్-19 వరల్డ్‌కప్‌లో యువ భారత్ అదరగొట్టింది. ఇంగ్లడ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి కప్ ఎగరేసుకుపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని 47.4 ఓవర్లలో చేధించింది. వైస్ కెప్టెన్ రషీద్, నిషాంత్ సింధు హాఫ్ సెంచరీలతో రాణించగా.. బౌలింగ్‌లో రాజ్ బవ 5 వికెట్లు, రవి కుమార్ 4 వికెట్లు తీసి అదరహో అనిపించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు ఒకరి వెంట మరోకరు పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ జార్జి థామస్ 30 రన్స్ చేయగా.. మరో ఓపెనర్ జాకబ్ కేవలం రెండు రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ ప్రెస్ట్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఓ దశలో 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న ఇంగ్లండ్ టీంను.. జేమ్స్ రూ ఆదుకున్నాడు. టెయిలండర్లతో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. చివర్లో జేమ్స్ సేల్స్‌తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఐతే 116 బాల్స్‌లో 95 పరుగులు చేసిన జేమ్స్ రూ.. జట్టు స్కోరు 184 పరుగుల దగ్గర 8 వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
తర్వాత మరో ఐదు పరుగులు జోడించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్...44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో రాజ్ బవ 5 వికెట్లతో రాణించగా.. రవి కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. కౌశల్ తాంబే ఒక వికెట్ తీశాడు.ఇంగ్లండ్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది.
ఓపెనర్ రఘువంశీ బోయిడెన్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఖాతా తెరవకుండానే భారత్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఐతే తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ రషీద్.. మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ హర్నూర్ సింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఐతే జట్టు స్కోరు 49 పరుగుల దగ్గర హర్నూర్ సింగ్ అస్పిన్‌వాల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
తర్వాత కెప్టెన్ యష్‌దూల్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు రషీద్. ఇదే క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 84 బాల్స్ ఆడిన రషీద్ 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి సేల్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రషీద్ అవుటైన కాసేపటికే కెప్టెన్ యష్‌దూల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 97 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.
తర్వాత క్రీజులోకి వచ్చిన నిషాంత్ సింధు, రాజ్ బవ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ఐతే జట్టు స్కోరు 164 పరుగుల దగ్గర 35 రన్స్ చేసిన రాజ్ భవ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కౌశల్ తాంబే కాసేపటికే అవుటయ్యాడు.
దీంతో జట్టు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న నిషాంత్ సింధు.. తన ఫస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 ఓవర్లోని రెండు,మూడు బంతుల్లో వరుస సిక్సులు కొట్టిన దినేష్ బన భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో 1998 తర్వాత మరోసారి కప్ గెలవాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇక ఐదు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో 35 పరుగులతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రాజ్ బవకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు 40 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌కు 25 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జైషా. ఇక సౌతాఫ్రికా ప్లేయర్ డేవాల్డ్ బ్రేవిస్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ భారత్ మొత్తం ఐదు సార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుంది. గతంలో 2000, 2008, 2012, 2018 టోర్నీల్లో కప్‌ను సొంతం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com