Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ..
Virat Kohli (tv5news.in)
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు కొహ్లీ.
నాకు అండగా ఉన్న రవిశాస్త్రి, ధోనీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాన్న కొహ్లీ.. టీమిండియాను సరైన దిశగా నడిపించేందుకు కృషి చేశానన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతకు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి కొహ్లీని తొలగించడం వివాదాస్పదం అయ్యింది.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సరైన ప్రదర్శన చేయకపోవడంతో.. టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడు కొహ్లీ. ఆ వెంటనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని తొలగించింది బీసీసీఐ. ఇది అప్పట్లో వివాదానికి దారితీసింది. కొహ్లీకి చెప్పే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ చెబితే.. తనకు కొద్ది నిమిషాల ముందే చెప్పి నిర్ణయం తీసుకున్నారని కొహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది టీమిండియా. ఈ సిరీస్ గెలిస్తే.. కొహ్లీ ఖాతాలో ఎన్నో రికార్డ్‌లు చేరేవి. కాని బ్యాట్స్‌మన్స్ అంతా చేతులెత్తేయడంతో.. ఘోర పరాభవం చూసింది టీమిండియా. ఆ వెంటనే టెస్ట్ కెప్టెన్సీ వదులుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించాడు కొహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో కొహ్లీ కూడా ఒకడు. కొహ్లీ నేతృత్వంలో 68 టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.
దాదాపు 59శాతం విన్నింగ్ పర్సంటేజ్‌తో కొహ్లీ నెంబర్ 1 ఇండియన్ కెప్టెన్‌గా ఉన్నాడు. కొహ్లీ తర్వాత స్థానంలో ధోనీ, గంగూలీ ఉన్నారు. వన్డేలు, టీ20ల్లో కూడా కొహ్లీనే నెంబర్-1 కెప్టెన్. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే కొహ్లీ విఫలమయ్యాడు. విదేశీ గడ్డపై టీమిండియాను పవర్‌పుల్‌గా నడిపించింది కూడా కొహ్లీనే. దూకుడైన ఆటతో ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్ల సరసన చేరాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com