14 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు..

Kieron pollard
అంతర్జాతీయ టీ20ల్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు నమోదయ్యాయి. వెస్టిండీస్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ ఈ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆంటిగ్వాలో జరిగిన తొలి టీ20లో పొలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. లంక లెగ్ స్పిన్నర్ ధనంజయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో విండీస్ కెప్టెన్ ఆరు సిక్సర్లు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
తొలుత మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి ఓపెనర్లు సిమన్స్ 15 బంతుల్లో 26 పరుగులు, ఎవిన్ లావిస్ 10 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఆరంభాన్నివ్వగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అఖిల ధనంజయ వరుసగా మూడు బంతుల్లో ఎవిన్ లావిస్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్‌ని ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేశాడు.
కానీ.. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మళ్లీ ధనంజయ బౌలింగ్‌కిరాగా.. కీరన్ పొలార్డ్ వరుసగా 6 సిక్సర్లు బాదేశాడు. దీంతో హ్యాట్రిక్ వికెట్లు తీశానన్న సంతోషం ఎంతోసేవు జరుపుకోలేకపోయాడు ధనంజయ. పొలార్డ్ చెలరేగిపోవడంతో.. వెస్టిండీస్ కేవలం 13.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించగా.. తాజాగా రెండో క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ ఘనత సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com