WPL: యూపీ వారియర్స్ విజయభేరి

WPL: యూపీ వారియర్స్ విజయభేరి
రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది

డబ్ల్యూపీఎల్ లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. గుజరాత్ జెయింట్స్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సి ఉండగా, గ్రేస్ హారిస్ లెగ్ సైడ్ అద్భుతమైన సిక్స్ కొట్టింది. 26 బంతులాడిన గ్రేస్ హారిస్ 59 పరుగులతో యూపీ వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమె స్కోరులో 7 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. సోఫీ ఎకెల్ స్టోన్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. అంతకుముందు, కిరణ్ నవ్ గిరే 53 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీసింది. ఇక గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది.

అంతకు ముందు డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో తన ప్రస్థానం ఆరంభించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ... ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించింది. 224 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలర్ తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టింది. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధన 35, హీదర్ నైట్ 34, ఎలిస్ పెర్రీ 31, మేగాన్ షట్ 30 పరుగులు చేశారు.

Tags

Next Story