WPL: ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో విజయం నమోదు చేసుకుంది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 212 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వారియర్స్ జట్టులో తహ్లియా మెక్ గ్రాత్ ఒంటరి పోరాటం చేసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా, ధాటిగా ఆడిన తహ్లియా 50 బంతులాడి 90 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోరులో 11 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.
తహ్లియా స్థాయిలో యూపీ వారియర్స్ జట్టులో మరెవ్వరూ ఆడకపోవడంతో ఆ జట్టుకు గెలుపు సాధ్యం కాలేదు. యూపీ జట్టులో కెప్టెన్ అలిస్సా హీలీ 24, దేవికా వైద్య 23 పరుగులు చేశారు. సాధించాల్సిన రన్ రేట్ పెరగడంతో తహ్లియా దూకుడు కొనసాగించింది. అయితే మరో ఎండ్‌లో సహకరించేవారు లేకపోవడంతో ఆమె పోరాటం వృథా అయింది. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాస్సెన్ 3 వికెట్లు తీయగా, మరిజానే కాప్ , శిఖా పాండే చెరో వికెట్ తీశారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com