డీఏవీ స్కూల్‌ ఘటనలో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

డీఏవీ స్కూల్‌ ఘటనలో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

అభం శుభం ఎరుగని పసిపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ ప్రిన్సిపల్ కారు డ్రైవర్‌గా పనిచేసిన రజనీకుమార్‌ పసిపిల్లలపై పలు మార్లు లైంగిక దాడి చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అనతి కాలంలోనే నిందితుడికి తగిన శిక్ష విధించింది.


గతేడాది అక్టోబర్ 17న రజినీకుమార్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ DAV స్కూల్లో డ్రైవర్‌గా పనిచేసిన రజినీ కుమార్‌ స్కూలుకు వచ్చే పసిపిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వాడు. స్కూల్లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రజినీకుమార్ బాలికను కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. స్కూలుకు చేరుకుని నిందితుడిని చితకబాది చేసి పోలీసులకు అప్పగించారు. గతేడాది అక్టోబర్ 17న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19న రిమాండ్‌కు తరలించారు.

రజినీకుమార్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. డ్రైవర్‌ రజనీకుమార్‌ అరాచకాలను స్కూల్‌లో పనిచేసే టీచర్లు ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు, స్కూల్‌లో చాలా మంది విద్యార్థినులపై డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.. విద్యార్థినులు, టీచర్ల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. ఈ నిందితుడిపై అత్యాచారంతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తన డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్కూల్ ప్రిన్సిపల్ మాధవిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు.

డీఏవీ స్కూల్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో నిందితుడికి, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని నినదించాయి. దీంతో.. పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పక్కా ఆధారాలను నాంపల్లి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అందించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. త్వరిగతిన విచారణ చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే కీలక తీర్పు వెలువరించింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షను విధించింది.

Tags

Read MoreRead Less
Next Story