ఆలీఘఢ్ లో వింత ఘటన: హత్యకు గురైందనుకున్న చిన్నారి క్షేమం, కానీ 7ఏళ్లుగా జైల్లోనే నిందితుడు

అలీఘఢ్
ఆలీఘఢ్ లో వింత ఘటన: హత్యకు గురైందనుకున్న చిన్నారి క్షేమం, కానీ 7ఏళ్లుగా జైల్లోనే నిందితుడు
ఆలీఘఢ్ లో హత్యకు గురైన మహిళ సజీవంగానే ఉందని గుర్తించిన పోలీసులు. జైల్లోనే మగ్గుతున్న నిందితుడు. విచారణ నిమిత్తం మహిళ తరలింపు.

ఆలీఘఢ్ : అప్పుడప్పుడూ నమ్మశక్యం కాని ఘటనలు పోలీసులకు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని కేసులు సినీ ఫక్కీలో రోజుకో మలుపు తిరుగుతూ వారి సహనానికి, మేధాశక్తికి పరీక్ష పెడుతుంటాయి. తాాజాగా ఆలీఘఢ్ పోలీసులకు ఇలాంటి విచిత్రమైన ఘటనే ఎదురైంది. దీంతో 2015నాటి హత్యకేసులో రీఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. 2015లో హత్యకు గురైంది అనుకున్న చిన్నారి ఇప్పుడు హర్తాస్ లో సజీవంగా ఉందని సమాచారం అందడంతో ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించబోతున్నారు.

వివరాల్లోకి వెళితే 2015లో ఆలీఘఢ్ లో 14ఏళ్ల వయసున్న బాలిక మిస్సింగ్ కేస్ ఫైల్ అయింది. కొన్ని రోజుల తరువాత ఆగ్రాలో దొరికిన బాలిక శవాన్నితండ్రి గుర్తుపట్టాడు. దీంతో ఆమెను అపహరించి, హత్య చేశాడు అన్న అనుమానంతో పొరిగింటిలోనే ఉంటూ కూలి పనులు చేసుకునే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు అవ్వడంతో సదురు వ్యక్తికి జీవితఖైదు పడింది. మూడేళ్ల శిక్ష అనంతరం బెయిల్ పై విడుదలైనప్పటికీ, కోర్ట్ ప్రొసీడింగ్స్ కు హాజరుకాని కారణంగా తిరిగి అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు.

తాజాగా హత్యకు గురైందనుకున్న బాలికను నిందితుడి తరఫు బంధువులు హర్తాస్ లో గుర్తుపట్టి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 21ఏళ్ల వయస్కురాలైన ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయినట్లు తెలుస్తోంది. ఆమెను విచారించేందుకు హర్తాస్ నుంచి ఆలీఘఢ్ కు తరలించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, 2015లో హత్యకు గురైంది అనుకున్న అమ్మాయి ఈమెనా అన్న విషయం ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే కోర్టును ఆశ్రయించి నిందితుడిపై ఆరోపణలు మాఫీ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు.


Tags

Next Story