leak: 16 బిలియన్ పాస్వర్డ్లు లీక్

డిజిటల్ ప్రపంచం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన భారీ డేటా లీక్‌లో యాపిల్, గూగుల్ (Google), ఫేస్బుక్, గిట్‌హబ్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 16 బిలియన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయని సైబర్ భద్రతా పరిశోధకులు వెల్లడించారు. ఫోర్బ్స్ మే 23న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ లీక్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా చెప్పవచ్చు.ఈ డేటా లీక్‌లో ప్రభుత్వ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల ఖాతాలు, కార్పొరేట్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం ప్రభావితమయ్యాయి. 30 వేర్వేరు డేటాసెట్లను గుర్తించిన పరిశోధకులు, వాటిలో ప్రతి ఒక్కటిలో సుమారు 3.5 బిలియన్ రికార్డులు ఉన్నాయని తెలిపారు. 2025 ప్రారంభం నుంచి లాగిన్ అయిన యూజర్ ఖాతాల సమాచారం కూడా ఈ లీక్‌లో ఉందని స్పష్టం చేశారు.
గతంలో 184 మిలియన్ యూజర్ వివరాలు మాత్రమే లీక్ అయినట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 16 బిలియన్లకు చేరిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ తమ వినియోగదారుల భద్రతను మెరుగుపరచేందుకు పాత సైన్-ఇన్ విధానాలను మార్చి, పాస్‌కీలు (Passkeys) అనే కొత్త లాగిన్ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. పాస్‌కీలు అనేవి వేలిముద్ర, ముఖ స్కాన్ వంటి బయోమెట్రిక్ ఫీచర్ల ద్వారా పాస్‌వర్డ్‌లను భర్తీ చేసే లాగిన్ విధానం. ఇవి ఫిషింగ్‌కు ప్రతిఘటించగలవని గూగుల్ పేర్కొంటోంది. వినియోగదారులు తమ ఖాతాలను పాస్‌కీలకు లేదా సోషల్ సైన్-ఇన్ విధానాలకు మార్చుకోవాలంటూ గూగుల్ సూచనలు ఇస్తోంది. ఈ డేటా ఉల్లంఘన తాలూకు వివరాలు ప్రపంచ వ్యాప్తంగా భద్రతపై చర్చకు దారి తీస్తుండగా, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం అత్యవసరమైంది. వినియోగదారులు కూడా తమ ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఉపయోగించడం, 2FA అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
2026 జనవరి నుంచి అన్ని టూవీలర్లకూ ABS తప్పనిసరి
టూవీలర్ ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి దేశంలో అమ్ముడయ్యే అన్ని ద్విచక్ర వాహనాల్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరి చేయాలన్న దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.ప్రస్తుతం 150 సీసీకి మించి ఉన్న ఇంజిన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలకే ABS తప్పనిసరి. అయితే, ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చే నిబంధనల ప్రకారం, ఎంట్రీ లెవెల్ మోడళ్లను కూడా ఈ వ్యవస్థ కిందకి తీసుకురానుంది. దేశంలోని టూవీలర్ మార్కెట్లో ఈ తరహా మోడళ్లే సుమారు 75% ఉన్నాయన్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే, 2022లో జరిగిన వాటిలో సుమారు 20% టూవీలర్ల వల్ల జరిగాయని ప్రభుత్వ డేటా చెబుతోంది. ఈ ABS విధానం అమలు చేయడం వల్ల వాహన తయారీదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com