అయిదు నెలల చిన్నారికి అనారోగ్యం.. అమ్మ అజ్ఞానంతో ఇనుప చువ్వను కాల్చి..

అయిదు నెలల చిన్నారికి అనారోగ్యం.. అమ్మ అజ్ఞానంతో ఇనుప చువ్వను కాల్చి..
5 నెలల పాప ఉంది. చిన్నారికి గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతోంది.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక మహిళ తన ఐదు నెలల కుమార్తె ఆరోగ్యం కుదుట పడేందుకు ఇనుప చువ్వతో కాల్చింది. వేడిని తాళలేని ఆ పసిబిడ్డ తల్లి చేతిలోనే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం‌కు తరలించి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

జిల్లాలోని మండల్ బ్లాక్‌లోని లుహరియా గ్రామంలో రమేష్ బగారియా, ఆయన భార్య లాహరి నివసిస్తున్నారు. వారికి 5 నెలల పాప ఉంది. చిన్నారికి గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతోంది. పాలు సరిగా తీసుకోలేకపోతోంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంది. దీంతో పాపకు పొట్ట సంబంధిత సమస్య ఉందని తల్లి లాహారీ భావించింది. బిడ్డను వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లకుండా స్థానిక తాంత్రికుడి వద్దకు తీసుకు వెళదామనుకుంది. అతడి తంత్ర విద్యను ముందే తెలుసుకుని దానిపై నమ్మకం పెంచుకుంది. తన కూతురి జబ్బును అతడు నయం చేస్తాడనుకుంది. అయితే అతడు పక్క గ్రామానికి వెళ్లాడని తెలుసుకుని తానే తన కుమార్తెకు వైద్యం చేయాలనుకుంది. అందులో భాగంగా ఓ ఇనుప చువ్వను వేడి చేసి బిడ్డకు అంటించింది. దీంతో పాపకు వ్యాధి నయం అవుతుందని భావించింది.

అయితే బిడ్డ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వెంటనే చిన్నారిని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చి వైద్యులు చికిత్స చేయడం ప్రారంభించారు. కానీ పాప ప్రాణాలు కోల్పోయింది. అనంతరం వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story