ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం ఓ కట్టుకథ.. అసలు ఏం జరిగిందంటే..

ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం ఓ కట్టుకథ.. అసలు ఏం జరిగిందంటే..
యువతి అందరినీ తప్పుదోవ పట్టిచిందని, యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘట్‌కేసర్‌ గ్యాంగ్‌ రేప్‌ అంత ఓ కట్టుకథ అని తేల్చారు పోలీసులు. ఫార్మసీ విద్యార్థినిపై కిడ్నాప్‌, అఘాయిత్యం అని జరిగిన ప్రచారం అంతా తప్పేనని పోలీసులు నిర్థరించారు. యువతిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

తనను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు ఫార్మసీ స్టూడెంట్‌ ఈనెల 10వ తేదీ సాయంత్రం తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. దీంతో ఆమె తల్లి డయల్‌ 100కు కాల్‌ చేశారు. తన కుమార్తెను ఆటో డ్రైవర్లు కిడ్నాప్‌ చేశారని పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతికి ఫోన్‌ చేయగా.. ఆమె తన సెల్‌ ఫోన్‌ నుంచి లోకేషన్‌ షేర్‌ చేసింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అన్నోజీగూడ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు దగ్గర బాధితురాలిని గుర్తించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

స్పృహలోకి వచ్చిన తర్వాత.. తనపై కొందరు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. అనుమానంతో నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు, బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. అమ్మాయి చెప్తున్న దానికి.. సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న దానికి అస్సలు సంబంధమే లేదని తేల్చారు పోలీసులు.

10వ తేదీ సాయంత్రం బాధితురాలు సాయంత్రం 6 గంటల నుంచి ఏడున్నర వరకు ఘట్‌కేసర్‌, యమ్నంపేట్‌, అన్నోజీగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే రోడ్లపై తిరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్‌ సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవనీ తేల్చారు. ఆ కోణంలో మరోసారి బాధితురాలిని ప్రశ్నించారు. చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదేపదే ఫోన్‌ చేస్తుండటంతో ఆటో డ్రైవర్‌ ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పానని యువతి అంగీకరించింది.

ఇంటి నుంచి వెళ్లిపోవడానికే యువతి కిడ్నాప్‌ నాటకమాడిందని, ఆటో డ్రైవర్లపై ఉన్న కోపంతో వారు కిడ్నాప్‌ చేశారని, అఘాయిత్యానికి పాల్పడ్డారని అబద్దం చెప్పిందని సీపీ వెల్లడించారు. ఫార్మసీ విద్యార్థినిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమెపై అత్యాచారం చేయలేదని తెలిపారు.

అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకుందన్నారు పోలీసులు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిచిందని, యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story