Uttar Pradesh: ఏడాదిన్నర పాపను వదిలేసి దంపతులిద్దరూ..

Uttar Pradesh: చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి వార్తలను రోజూ మనం పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల బంధమైనా ఒక్క చిన్న గొడవతో ముగిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు. కానీ అలా గొడవపడినా చావులో కూడా తోడుండాలి అని కోరుకుంటున్నారు మరికొందరు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇలాంటి ఒక ఘటనే చోటుచేసుకుంది.
31ఏళ్ల అమిత్ బన్సాల్‌కు మూడేళ్ల క్రితం పింకీతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. ఇటీవల వీరిద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దగా మారింది. దీంతో ఇరువురి కుటుంబసభ్యులు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ ఆ గొడవను మర్చిపోలేని అమిత్ మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చాలాసేపటి తర్వాత అమిత్ చనిపోవడాన్ని గుర్తించిన పింకీ.. తన భర్త లేని జీవితం తనకు వద్దనుకుంది. అందుకే కత్తి తీసుకుని శరీరం మీద అనేక చోట్ల పొడుచుకుంది. కాసేపటికి ఇది గమనించిన కుటుంబసభ్యులు అమిత్, పింకీలను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అమిత్ మరణించాడని తెలిసింది. తీవ్ర గాయాలపాలైన పింకీ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. ఏడాదిన్నర పాప గురించి ఆలోచించకుండా ఆ దంపతులు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com