మోసగాడినే మోసం చేసిన వ్యక్తి.. సైబర్ నేరగాడి ఆటకట్టించిన కాన్పూర్ యువకుడు..

కాన్పూర్ వ్యక్తి సైబర్ నిందితుడిని ఒక ఆట ఆడించాడు.. తననే మోసం చేద్దామనుకుంటే ఆ విషయం పసిగట్టి ఆ సైబర్ నేరగాడినే బురిడీ కొట్టించాడు. అతడి నుండి 10 వేల రూపాయలు వసూలు చేశాడు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటివి తెలుసుకోవడం చాలా అవసరం.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు సైబర్ మోసగాడిని మోసం చేసి అతడి ఖాతా నుండి రూ.10,000 తన సొంత ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఆ మోసగాడు భూపేంద్రను మోసం చేయబోయి తాను మోసపోయానని గ్రహించి తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నాడు.
తప్పించుకోవడానికి ఒక తెలివైన ప్రణాళిక రూపొందించాడు భూపేంద్ర
ఒక మోసగాడు తాను సీబీఐ అధికారినని చెప్పుకుంటూ భూపేంద్ర సింగ్‌కు ఫోన్ చేయడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. భూపేంద్రకు సంబంధించిన అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని, కేసును మూసివేయడానికి లంచం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. ఏదో తప్పు జరిగిందని గ్రహించిన భూపేంద్ర, ఆ మోసగాడిని మోసం చేయడానికి ఒక తెలివైన పథకం వేశాడు.
కంగారు పడుతున్నట్లు నటిస్తూ భూపేంద్ర ఆ మోసగాడితో, “అంకుల్, దయచేసి నా అమ్మకి చెప్పకండి, లేకుంటే నేను పెద్ద ఇబ్బందుల్లో పడతాను” అన్నాడు. ఈ విషయాన్ని పరిష్కరించడానికి మోసగాడు రూ.16,000 డిమాండ్ చేశాడు. భూపేంద్ర తన బంగారు గొలుసును తాకట్టు పెట్టానని, దానిని తిరిగి పొందడానికి రూ. 3,000 అవసరమని ఒక కట్టుకథ అల్లి మోసగాడికి వినిపించాడు.
మోసగాడు భూపేంద్ర చెప్పింది నిజమేనని నమ్మి, అతను డబ్బును భూపేంద్రకు బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ మోసగాడు మళ్ళీ ఫోన్ చేసాడు. భూపేంద్ర మరొక కథ చెప్పాడు. భూపేంద్ర తాను మైనర్ ని అని ఆ నగల వ్యాపారి గొలుసు ఇవ్వడానికి నిరాకరించాడని, ఈ విషయాన్ని పరిష్కరించడానికి మోసగాడిని తన తండ్రిలా నటించమని సూచించాడని అతను పేర్కొన్నాడు.
భూపేంద్ర స్నేహితుడు నగల వ్యాపారిగా నటిస్తూ మోసగాడితో మాట్లాడి అదనంగా రూ.4,480 పంపమని ఒప్పించాడు. ఆ మోసగాడు మళ్ళీ భూపేంద్రను సంప్రదించాడు. ఈసారి భూపేంద్ర బంగారు రుణం పొందానని తప్పుడు కథను కల్పించాడు. అతను మళ్ళీ తన స్నేహితుడిని కూడా ఈ పథకంలో ఇరికించాడు. గొలుసును తాకట్టు పెట్టడం ద్వారా రూ. 1.10 లక్షల రుణం పొందవచ్చని, అయితే దీనికి రూ. 3,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మోసగాడిని ఒప్పించాడు భూపేంద్ర స్నేహితుడు.
ఆ మోసగాడికి ఇంకా మోసం గురించి తెలియదు కాబట్టి అతను డబ్బును భూపేద్రకు బదిలీ చేశాడు. మొత్తం మీద, భూపేంద్ర మోసగాడి నుండి రూ. 10,000 వసూలు చేయగలిగాడు. ఆఖరికి తాను మోసపోయానని ఆ మోసగాడు గ్రహించాడు. తానే మోసం చేయాలనుకుంటే తననే మోసం చేసే వాడు ఉన్నాడా అని నెత్తీ నోరు బాదుకుంటూ తాను పంపించిన 10వేల రూపాయలను తిరిగి ఇవ్వమని భూపేంద్రను వేడుకుంటూ, "నువ్వు నాకు అన్యాయం చేశావు, దయచేసి నా డబ్బు తిరిగి ఇవ్వు" అని అడిగాడు.
ఈ సంఘటనపై భూపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసగాడి నుండి తీసుకున్న డబ్బును ఒక పేద వ్యక్తికి విరాళంగా ఇస్తానని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com