AP: విద్యార్థులపై విచక్షణా రహిత దాడి

AP: విద్యార్థులపై విచక్షణా రహిత దాడి
నంద్యాల జిల్లాలో దారుణం... పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు

నంద్యాలలో విద్యార్థులపై ఆకతాయిలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్‌డీఆర్‌ పాఠశాల సమీపంలో కొందరు ఆకతాయిలు ఇద్దరు విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆగస్టు 1న ఎస్‌డీఆర్‌ పాఠశాల ఛైర్మన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఓ ఇంటర్‌ విద్యార్థిని సుబ్బయ్య, శంకర్, మరికొంత మంది అడ్డగించి, డబ్బులివ్వాలని డిమాండ్‌ చేశారు. తన వద్ద డబ్బు లేదని విద్యార్థి చెప్పగా, విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ బాలుడు తనకు తెలిసిన బీటెక్‌ విద్యార్థి లోకేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి, జరిగిందంతా వివరించాడు. అతను వెంటనే అక్కడికి రాగా, ‘డబ్బులివ్వాలని అడిగితే నువ్వెందుకొచ్చావ్‌’ అంటూ దుండగులు లోకేశ్వర్‌రెడ్డిపైనా దాడికి పాల్పడ్డారు.

దుస్తులు విప్పదీసి రహదారిపై ఈడ్చుకెళ్లడంతో పాటు ఛాతీపై కూర్చొని కొట్టారు. అతని చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. ఘటన జరిగిన రోజు నుంచి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా, పోలీసులు కేసు పెట్టలేదంటూ బాధితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ దారుణం పాఠశాల సమీపంలో జరగ్గా, స్కూలు యాజమాన్యమే కేసు నమోదు కాకుండా అడ్డుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు సుబ్బయ్య, శంకర్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల గ్రామీణ సీఐ దస్తగిరిబాబు తెలిపారు.

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలానికి చెందిన వైసీపీ కీలక నేత మామిడి తోటలో రూ.2 కోట్ల విలువ చేసే 42 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరంగరాజపురం మండలంలోని పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవి తన మామిడి తోటలో ఎర్రచందనం చెట్లు పెంచారు. వాటిని విక్రయించేందుకు తిరుపతి జిల్లా పిచ్చాటూరుకు చెందిన లైసెన్స్‌డ్‌ ఎర్రచందనం వ్యాపారి రవినాయుడితో మాట్లాడారు. చెట్లు నరికించి, దుంగలుగా చేసి, వాటికి నంబర్లు వేసి అక్కడే ఓ గదిలో భద్రపరిచారు. జులై 23న కొన్ని దుంగలు చోరీ కాగా, మిగిలినవి అక్కడి నుంచి వైకాపా కీలక నేత మామిడి తోటలోకి తరలించారు. అక్కడి నుంచి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులకు సమాచారమందింది. దుంగలను స్వాధీనం చేసుకుని, ఓ కూలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు అసలు నిందితులను వదిలేసి కూలీని అరెస్టు చేశారంటూ తెదేపా నాయకులు ఎస్సార్‌పురం ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్వేటినగరం సీఐ సత్యబాబు వచ్చి, వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు.

Tags

Next Story