ప్రేమను గెలిచారు.. కానీ విధి ఓడించింది!

వారు ఒకటి తలచితే పాపం విధి మరొకటి తలచి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది. ఆమెకు గూడూరు అయ్యవారిపాళేనికి చెందిన జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెద్దలను ఎదురించి గత ఏడాది అక్టోబర్ 29వ ప్రేమపెళ్లి చేసుకున్నారు. ప్రేమను అయితే గెలిచారు కానీ.. విధి వారిని ఓడించింది.
డిసెంబర్‌లో జగదీష్ గుండెపోటు రావడంతో మృతిచెందాడు. తన భర్త జగదీష్ చనిపోవడంతో శిరీష తీవ్రమనోవేదనకు గురైంది. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. బంధువులు, స్నేహితులు ఎవరు ఎంత దైర్యం చెప్పినప్పటికీ చివరికి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని తన స్నేహితురాలకి చెప్పింది శిరీష. వెంటనే ఆమెను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే శిరీష మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.
అయితే ఆమె కుడి చేతి మీద ఇంజెక్షన్లు తీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై స్నేహితులు మృతురాలి కుటుంబసభ్యులకు, దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. భర్త జగదీష్ మృతిచెందిన కొద్దిరోజులకే శిరీష కూడా మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com