Peddapalli: లోన్ యాప్ వేధింపులు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి తల్లిదండ్రులకు పంపి..

Peddapalli: లోన్‌యాప్ నిర్వాహకులు పెట్రేగిపోతున్నారు. అవసరానికి తీర్చుకున్న అప్పుల వసూళ్లకు... ఎంతకైన బరితెగిస్తున్నారు. నిర్వాహకుల వేధింపులకు అమాయకులు బలైపోతున్నా వారి తీరు ఏ మాత్రం మారడం లేదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రశాంత్...సింగరేణిలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నారు. అసరాలల కోసం మనీవ్యూ అనే యాప్ నుంచి 60 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు. అయితే ప్రశాంత్ సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి.
తొలుత ప్రశాంత్‌కు ఫోన్ చేసి బూతులు తిడుతూనే బెదిరించారు. అనంతరం ప్రశాంత్ వేరే మహిళతో అసభ్యంగా ఉన్నట్టు ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అతని తల్లికి వాట్సాప్ చేశారు. డీపీగా పెట్టుకున్న తల్లిదండ్రుల ఫోటోపై అసభ్యపదజాలంతో మాటలు రాసి వాట్సప్‌లో పోస్టు పెట్టారు. ఆ ఫొటోలను ప్రశాంత్ కుటుంబ సభ్యులకు షేర్ చేశారు. మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను యువకుని కాంటాక్టులకు పంపించారు.
రుణ యాప్ నిర్వాహకుల తీరుతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఈనెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయినా ప్రశాంత్ తల్లికి ఫోన్ చేసిన యాప్ నిర్వాహకులు.. బూతులు తిడుతూ డబ్బు కోసం బెదిరించారు. ప్రశాంత్ ఫోన్ స్విచ్‌ఆఫ్ ఉండటంతో తల్లిదండ్రులు ఆదే రోజు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈనెల 9న రామగుండం - రాఘవాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై ప్రశాంత్ మృతదేహం గుర్తించారు.
శవపరీక్ష సమయంలోనూ యాప్ నిర్వాహకులు వేధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అడ్డగోలుగా పుట్టుకొస్తున్న యాప్‌లపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. అమాయకుడిని బలిచేసిన యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రశాంత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com