పాపం పంచాయతీ కార్యదర్శి.. కష్టపడి కోట్లు సంపాదిస్తే ఏసీబీ అధికారులు..

పంచాయితీ కార్యదర్శిగా ఉద్యోగం. ఆమాత్రం వెనకేసుకోపోతే నలుగురిలో చులకనైపోము. అయినా అడక్కముందే ఇస్తున్నారు. వాళ్ల బాధ వాళ్లది. పనవడానికి లంచానికి మించిన మార్గం ఏముంటుంది. ఏదో ఇచ్చింది తీసుకుంటే ఆ సొమ్ము ఇలా పాపంలా పెరిగిపోయింది. ఆగూరు వెంకటరావు ఎన్నడూ అనుకోలేదు ఇలా ఏసీబీ అధికారులు దాడి చేస్తారని, కష్టపడి కూడబెట్టిన రూ.50 కోట్లు పట్టుకుపోతారని.
ఎవరో గిట్టని వాళ్ల పనే ఇది.. వాళ్లే తన మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటారని వాపోతున్నారు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయితీ కార్యదర్శి, రణస్థలిలో గ్రేడ్-1 పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటరావు. శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సమాచారం అందడంతో సోదాలు చేశారు.
శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, 669 గ్రాముల బంగారు ఆభరణాలు, భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. క్రమంగా అక్కడి నుంచి గ్రేడ్-1 పంచాయితీ కార్యదర్శితో పాటు ఇన్‌చార్జి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని వెంకటరావుపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.
పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న అతని కుటుంబసభ్యుల ఇళ్లనై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోనా రామా టాకీస్ డౌన్‌లోని వెజిటబుల్ మార్కెట్ దరి సువర్ణ రెసిడెన్సీలో రెండో అంతస్తులో వెంకటరావు నివాసం ఉంటున్న 202 ప్లాట్‌లో అధికారులు సోదాలు చేశారు.
అతని ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కర్‌రావు, హరి, మహేష్, ఎస్‌ఐ చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, వెంకటరావును అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపారు. అతడిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండు తరలిస్తామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com