అప్సర హత్య కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

అప్సర హత్య కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం కొనసాగుతున్నట్లు వెల్లడించారు

అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం కొనసాగుతున్నట్లు వెల్లడించారు. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమాయణం నడించిందని పోలీసులు వెల్లడించారు. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయికృష్ణ మెసేజ్‌లు చేసేవాడని తేల్చారు. నవంబర్‌లో సాయికృష్ణ, అప్సర ఇద్దరు కలిసి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించినట్లు తెలిపారు. గుజరాత్‌ టూర్‌ తరువాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందన్నారు. ఇక వాట్సాప్‌ ద్వారానే అప్సర లవ్‌ ప్రపోజ్‌ చేసిందన్నారు. వీరి బంధం కొనసాగుతుండగానే ఇక పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తెచ్చిందన్నారు. ఒక వేళ తనను పెళ్లి చేసుకోకపోతే సాయికృష్ణను రోడ్డుపైకి ఈడ్చుతానని బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు.

ఇక అప్సర ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన సాయికృష్ణ.. హత్య చేసినట్లు వెల్లడించారు. ఇక అప్సర హత్యకు వారం రోజుల ముందే సాయికృష్ణ మర్డర్‌ ఎలా చేయాలని గూగుల్‌లో వెతికినట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇక తనను కోయంబత్తూర్‌ తీసుకెళ్లాలని సాయికృష్ణను అప్సర కోరడంతో అక్కడే స్పాట్‌ పెట్టాలని నిందితుడు భావించినట్లు పోలీసులు చెప్పారు.

3వ తేదీ కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయి కృష్ణ... రాత్రి 8గంటల 15 నిమిషాలకు ఆమెను సరూర్‌ నగర్ నుంచి కారులో తీసుకెళ్లాడు. రాత్రి 9గంటలకు ఇద్దరు శంషాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ఇక శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని సాయి కృష్ణ అప్సరతో చెప్పిన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. ఇక అక్కడి నుంచి గోషాలకి వెళ్తున్నట్టు చెప్పిన సాయికృష్ణ.. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కారు ఆపినట్లు చెప్పారు. అప్పటికే ఆరోగ్యం బాగాలేక ఓ సారి అప్సర వాంతులు చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేసిన సాయి కృష్ణ.. 12 గంటలకి సుల్తాన్ పల్లిలో ఉన్న గోశాల వద్దకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3గంటల 50 నిమిషాలకు ఇద్దరు వెంచర్ సైడ్ వెళ్లారు. ఇక నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను సాయికృష్ణ హత్య చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story