Bengaluru : రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహం.. వరుసగా మూడవసారి

Bengaluru : రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహం.. వరుసగా మూడవసారి
X

బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. గడిచిన మూడు నెలల్లో ఇలాంటి ఘటన మడవది. బెంగళూరులోని బైపనహళ్లి రైల్వే స్టేషన్ బయట ఓ డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ వయస్సు 32-35 ఏళ్ల మధ్య ఉంటుందని కర్ణాటక రైల్వేస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.కె సౌమ్యలత తెలిపారు. మృతురాలు ఎవరనేది గుర్తించాల్సి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గత ఏడాది చివరి నుంచి బెంగళూరులో ఇలాంటి రెండు కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. డిసెంబరు రెండవ వారంలో, SMVT రైల్వే స్టేషన్‌లోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో పసుపు గోనెలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇతర సామానులతో పాటు ఉంచబడిన గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో ఓ ప్రయాణీకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంచిని తెరిచి చూడగా కుళ్లిపోయిన అవశేషాలు కనుగొనబడ్డాయి.

జనవరి 4న యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 చివరన పాడుబడిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుళ్ళిపోయిన యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం నుంచి తీసుకువచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మూడు సంఘటనలకు సంబంధం ఉందా అన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.

Next Story