Bhim Army: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

భీమ్ ఆర్మీచీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని చంద్రశేఖర్ ఆజాద్ తిరిగి వస్తుండగా దుండగులు ఆయనపై బహిరంగంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తూటా తగలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులు హర్యానా లైసెన్స్ నంబర్ ప్లేటు కలిగిన కారులో వచ్చి కాల్పులు జరిపినట్లు గుర్తించారు.
ఈ ఘటన సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఆ కారులోని సీటు, డోర్‌పై బుల్లెట్లు తగిలినట్టు గుర్తించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు సమీపంలోకి దూసుకొస్తూ దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కొందరు కారులో వెళ్తూ కాల్పులు జరిపారని.... ఆయనకు ఓ తూటా తగిలిందని.. ఆజాద్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై హత్యాయత్నంపై దేవ్‌బంద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చంద్రశేఖర్ ఆజాద్ సహచరుడు మనీష్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి ఆకస్మిక దాడిని తాను ఊహించలేదని... శాంతిభద్రతలను కాపాడాలని భీమ్ ఆర్మీ చీఫ్.. తన మద్దతుదారులకువిజ్ఞప్తి చేశారు. ఇలాంటి దాడులతో భయపడేది లేదన్న ఆజాద్... రాజ్యాంగబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కోట్లాది ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. కాల్పులు జరిపినప్పుడు తన తమ్ముడు కూడా కారులోనే ఉన్నాడని ఆజాద్ తెలిపారు. ఆజాద్‌తో తాను మాట్లాడానని.... కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని... నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సహరాన్‌పూర్ ఎస్పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com