Seema Patra : బీజేపీ నేత సీమాపాత్ర పైశాచికత్వం..

Seema Patra : తమ ఇంట్లో పని చేస్తున్న మహిళను టార్చర్ పెట్టి.. ఆమెకు నరకం చూపిన బీజేపీ నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమా పాత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది.
మరోవైపు బీజేపీ పార్టీ నుంచి సీమా పాత్రను సస్పెండ్ చేశారు. సీమా బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు.జార్ఖండ్ గుమ్లా జిల్లాకు చెందిన 29 ఏళ్ళ ఆదివాసీ మహిళ సునీత దాదాపు 10 ఏళ్లుగా సీమా పాత్ర ఇంట్లో పని చేస్తోంది.అయితే ఆరేళ్లుగా తన యజమానురాలు తనను ఇంట్లోనే నిర్బంధించిందని, వేడి రాడ్లతో తన ఒంటిమీద వాతలు పెట్టేదని, ఇష్టమొచ్చినట్టు బెల్టుతో కొట్టేదని ఆమె వాపోయింది. సీమా పాత్ర దాడిలో
తన నోటి పళ్ళు ఊడిపోయాయని వాపోయింది సునీత.రాంచీ ఆసుపత్రిలో లేవలేని స్థితిలో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఒంటిమీద వాతలు, గాయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈమె అమానుషంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com