Home
 / 
క్రైమ్ / Chikoti Praveen : ఆ...

Chikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..

Chikoti Praveen : చికోటి ప్రవీణ్ సామ్రాజ్యం రాష్ట్రాల సరిహద్దులను సైతం చెరిపేసింది

Chikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..
X

Chikoti Praveen : చికోటి ప్రవీణ్ సామ్రాజ్యం రాష్ట్రాల సరిహద్దులను సైతం చెరిపేసింది. క్యాసినోతో మొదలుపెట్టిన చికోటి వ్యాపారం.. హవాలాతో పాటు బంగారం, బెట్టింగ్, సినిమాల్లో పెట్టుబడుల వైపు కూడా వెళ్లిందనే టాక్‌.. ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బంగారం వర్తకంలో బ్లాక్ బిజినెస్‌కు అడ్డా అని చెప్పుకుంటున్న ప్రొద్దుటూరులోనూ.. చికోటి ప్రవీణ్‌ టీమ్ ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉన్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ వ్యహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అతని సామ్రాజ్యంపై ఈడీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. చికోటి ప్రవీణ్ హవాలా వ్యాపారం ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతోంది. గోవాలోని క్యాసినోలు, బిగ్ డాడీకి ప్రొద్దుటూరు నుంచి బంగారం వ్యాపారులను కూడా చికోటి ప్రవీణ్‌ పట్టుకుపోయాడనే టాక్ నడుస్తోంది.

నేపాల్‌లో మేచీ క్రౌన్ హోటల్‌లో జరిగిన క్యాసినోకు ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 మంది పంటర్లు వెళ్లినట్లు సమాచారం. ఈ రిలేషన్స్‌ కేవలం క్యాసినోతోనే ఆగిపోలేదని, బెట్టింగ్, గోల్డ్ హవాలా, సినిమా ఫైనాన్స్‌ల వరకు వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. బెట్టింగ్, బంగారం లావాదేవీల్లో జీరో బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బును.. హవాలా మార్గంలో ఇతర రంగాలకు మళ్లించారని తెలుస్తోంది.

ప్రొద్దుటూరులోని మోడంపల్లి వీధికి చెందిన ఓ బడా బెట్టింగ్ డాన్, చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ హోదాలో ఉన్న ఓ వైసీపీ నేత అండదండలతో హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ కేంద్రాల్లో భారీగా బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించారనే ప్రచారం ఉంది. ఈ బెట్టింగ్‌లలో వచ్చిన మొత్తాన్ని చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో క్యాసినో, బిగ్ డాడీలో జూదాల నిర్వహణకు పెట్టుబడిగా పెట్టినట్లు ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

బంగారం వర్తకంలో ప్రొద్దుటూరును మరో ముంబై అని పిలుస్తారు. అందుకే, స్వర్ణపురిగా, గోల్డెన్ టౌన్‌గా ప్రొద్దుటూరు చరిత్రకెక్కింది. అలాంటి ప్రొద్దుటూరుతో చికోటి ప్రవీణ్‌కు లింకులు ఉన్నాయనే ప్రచారం జరగడం, వ్యవహారం బంగారం హవాలా వరకు విస్తరించిందనే వార్తలు రావడం కలవరపెడుతోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరులోని మోడంపల్లి బెట్టింగ్ డాన్, చిత్తూరు జిల్లా అధికార పార్టీకి చెందిన నామినేటెడ్ నేత.. ఈ ఇద్దరూ చికోటితో హవాలా సంబంధాలు నడిపినట్లు తెలుస్తోంది.

ప్రొద్దుటూరు నగల వ్యాపారులకు ఆంధ్ర, తెలంగాణలోని పట్టణాల మొదలు పల్లెల వరకు గడప గడపకు కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడి జీరో బిజినెస్ చూసి జైన్‌లు, మార్వాడీలు, పెద్ద పెద్ద గోల్డ్ షోరూమ్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతుంటారు. చెన్నై, హైదరాబాద్‌ నుంచి క్వింటాళ్ల కొద్ది విచ్చలవిడిగా లెక్కలు చూపని బంగారం తెచ్చి ప్రొద్దుటూరులో ఆర్నమెంట్‌గా మార్చి కస్టమర్లకు బిల్లులు లేకుండా బంగారాన్ని అమ్ముతారనే ప్రచారం ఉంది. 200లకు పైగా ఉన్న ఈ నగల షాపుల్లో ప్రభుత్వ లెక్కలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేవి కేవలం చేతివేళ్ల మీద మాత్రమే లెక్కించవచ్చని చెప్పుకుంటుంటారు.

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారంలో జరిగే.. దో నెంబర్ బిజినెస్‌ను ట్రావెల్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ పార్సెల్ సర్వీసెస్‌ ద్వారా నడిపిస్తుంటారనే ప్రచారం ఉంది. ఇలా బంగారం సరఫరా చేసినందుకు.. కేజీల లెక్కన కమీషన్లు ముట్టచెబుతుంటారని సమాచారం. హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చే ఈ బ్లాక్ బంగారం సరఫరాలో దాదాపు 15 మంది చికోటి ప్రవీణ్ అనుచరులు స్లీపర్ సెల్స్‌లా పని చేస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. చికోటి ప్రవీణ్‌పై ఎప్పుడైతే ఈడీ ఫోకస్‌ పెట్టిందో.. అప్పటి నుంచి అతనితో సంబంధాలున్న కొందరు జూదరులు, హవాలా రాకెట్ సూత్రధారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story