Chikoti Praveeen : చీకోటి లిస్ట్‌లో ఉన్నది వీరే.. సుమారు రూ.30 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు..

Chikoti Praveen : చీకోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతనితో పాటు మాధవ్‌రెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్ బ్యాచ్ ఎంత హైఫైగా ఈవెంట్లు నిర్వహించిందో తాజాగా బయటకు వస్తున్న విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. చాలా పక్కాగా నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తున్న ఈ గ్యాంగ్.. జూదంలో డబ్బంతా హవాలా మార్గంలోనే ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆధారాలు దొరకడంతో.. చీకోటి లిస్ట్‌లో ఉన్న రాజకీయ ప్రముఖులు, సినీతారల్లో టెన్షన్ పుట్టుకుంది. ఈ అంశాన్ని నిగ్గు తేల్చే పనిలో ఈడీ నిమగ్నమైంది. రేపు ప్రవీణ్ బృందాన్ని ఈడీ విచారించనుంది. ఆ తర్వాత కేసులో అనూహ్య మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి.
క్యాసినోను చట్టబద్ధంగానే నిర్వహిస్తున్నానని నమ్మబలికి.. చీకోటి ప్రవీణ్ 30 కోట్ల మేర అక్రమ లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఈవెంట్లకు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల్ని రప్పించడం ద్వారా ప్రముఖుల్ని ఆకర్షించి.. క్యాసినోలో కోట్లకు కోట్లు పందాలు జరిపించాడు. ఆ గేమ్స్ ద్వారా కమీషన్ కూడా బాగానే వెనకేసుకున్నాడని చెప్తున్నారు.
విదేశాలకు వెళ్లే జూదగాళ్ల విమాన ప్రయాణ ఖర్చులు, హోటళ్ల వసతికి సంబంధించిన లావాదేవీల లెక్కలు తప్పితే.. క్యాసినోలో గెలిచిన వాళ్లకు ఇచ్చిన నగదు గురించిన ఎలాంటి ఆధారాల్ని చీకోటి ప్రవీణ్ చాలా సీక్రెట్‌గా దాచిపెట్టాడు. ఇప్పటివరకు విదేశాల్లో 10 క్యాసినో ఈవెంట్లను నిర్వహించగా.. ఆయా ఆటల్లో కాయిన్ల విక్రయాలకు సంబంధించి ఆధారాలు దొరక్కుండా చేశాడు.
విదేశాల్లో క్యాసినోలు నిర్వహించడానికి ప్రవీణ్‌కు ట్రావెల్ ఏజెంట్ సంపత్ సహకరించాడని.. మాదాపూర్‌లో ఒక ట్రావెల్ సంస్థను నిర్వహిస్తూ.. ప్రత్యేక విమానాలను బుక్ చేయడం నుంచి జూదరులకు హోటళ్లలో బస, విందు, వినోదాల వరకూ చూసేవాడని తేలింది. సెలబ్రిటీల్ని క్యాసినో ఈవెంట్లకు రప్పించడం ద్వారా.. ఆ క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని హవాలా కలెక్షన్లను బాగానే పూర్తి చేశాడని ED అనుమానిస్తోంది. ఇప్పుడు అకౌంట్ల ట్రాన్సాక్షన్‌లన్నీ పరిశీలిస్తూ మొత్తం గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.
గత నెల 10 నుంచి 13 వరకు నేపాల్‌లోని జాపాలో జరిగిన ఆల్ ఇన్ క్యాసినోకు ప్రత్యేక విమానాలను సంపత్ బుక్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు రెండు వందల మందికి మూడు వేర్వేరు హోటళ్లలో బసకు అతడే ఏర్పాట్లు చేశాడని సమాచారం. వీరు ఇప్పటివరకు 10 క్యాసినోలను విదేశాల్లో నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర మోడళ్లను మధ్యవర్తుల సహకారంతో విదేశాలకు తీసుకెళ్లారని, వారిలో కొందరికి బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయగా.. మరికొందరికీ హవాలా మార్గంలో ముట్టజెప్పారని తెలుస్తోంది. క్యాసినో నిర్వహణ, నగదు లావాదేవీల్లో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం-1999ని ఉల్లంఘించారనేది ఈడీ ఆరోపణ.
హవాలా మార్గంలో జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. వారిలో చికోటి ప్రవీణ్, మాధవ్‌రెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్‌తో పాటు మరో ఇద్దరు హవాలా ఏజెంట్లు ఉన్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో రేపు ఆ ఐదుగురు విచారణకు హాజరుకానున్నారు.
ఇక.. చీకోటి ప్రవీణ్‌తో రాజకీయ ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. క్యాసినోల నిర్వహణ మాటున ప్రముఖుల సొమ్మును ఏమైనా విదేశాలకు తరలించారా అనే అంశంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, సినీతారలతో సత్సంబంధాలు నెరిపే స్థాయికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో వారికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అటు.. గోవాలోని ప్రముఖ బిగ్‌డా డీ క్యాసినోలో చీకోటికి వాటా ఉన్నట్లు తెలుస్తోంది. దాని పేరు మీదనే విదేశాల్లోనూ క్యాసినోలను నిర్వహిస్తున్నాడు. అయితే.. క్యాసినో జరిగే ప్రాంతానికి ప్రవీణ్ పూర్తి హంగు, ఆర్భాటాలతో వెళ్లేవాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాగ్‌డ్రోగాకు విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేపాల్‌లోని క్యాసినో నిర్వహించే హోటల్‌కు చేరుకున్నాడు. గతంలో తనకు భద్రత కల్పించాలని గోవా ప్రభుత్వాన్ని ఆశ్రయించగా కొన్నిరోజులు ఇద్దరు గన్‌మెన్‌తో రక్షణ కూడా కల్పించారు.
నేపాల్‌లో జరిగిన క్యాసినోలో కోట్లు గెలుచుకున్న కొందరు జూదరులు సంతోషం పట్టలేక ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ నగదుతో ఉన్న చిత్రాలను పంచుకున్నాడు. ఈ వ్యవహారాన్ని కొందరు ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్యాసినోలో హవాలా ద్వారానే కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ప్రాథమికంగా నిర్థారించి.. సోదాలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com