Loan App Suicide : లోన్ యాప్ వేధింపులు.. దంపతుల ఆత్మహత్య..

Loan App Suicide : ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి.. ఇంకెన్ని జీవితాలు నాశనం కావాలి. లోన్ యాప్ ఆగడాలకు అంతమే లేదా.. నిత్యం ప్రాణాలు పోతున్నా లోన్ యాప్ వేధింపులకు చెక్ పడటం లేదు ఎందుకు.? కాసుల కక్కుర్తికి నిండు ప్రాణాలు బలవుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయా. తీసుకున్న రుణాలు జీవితాల్లో దారుణాలను మిగిల్చుతకున్నాయి. తాజాగా లోన్ యాప్ వేధింపులు ఇప్పుడు ఇద్దరి దంపతులను బలి తీసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను అనాథలుగా మిగిల్చాయి.
లోన్ యాప్ వేధింపులు భరించలేక తూర్పుగోదావరి జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి చనిపోయారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి దంపతులు కొంతకాలంగా రాజమండ్రిలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అవసరం అప్పువలలో చిక్కేలా చేసింది. లోన్ యాప్ ద్వారా 50వేలు తీసుకున్నారు. సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. మార్ఫింగ్ ఫోటోలు పెడతామంటూ బెదిరించారు. పైగా బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు ఒడిగట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com