Crime : వివేకా హత్య కేసు మరింత వేగవంతం

Crime : వివేకా హత్య కేసు మరింత వేగవంతం
అవినాష్ లేఖపై స్పందించిన సీబీఐ ఈ నెల 10న హైదరాబాద్ కార్యాలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే అనేక సార్లు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా తాను హాజరుకాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో.. మళ్లీ ఈ నెల 10వ తేదీన హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు. కాగా.. రెండ్రోజుల క్రితం.. ఈ నెల 6వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి చెప్పి వెళ్లారు అధికారులు. ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. మరోసారి విచారించేందుకు సిద్ధం కాగా.. నియోజకవర్గంలో షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్స్‌ ఉన్నాయని సోమవారం విచారణకు హాజరుకాలేనంటూ అవినాష్ సీబీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అవినాష్ లేఖపై స్పందించిన సీబీఐ 10న హైదరాబాద్ కార్యాలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి సైతం సీబీఐ నోటీసులు ఇచ్చింది. 12వ తేదీన కడపలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించింది. కాగా, వివేకా హత్య కేసులో మొదటి నుంచి అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story