crime:మీరు అధ్యాపకులా రాక్షసుల వారసులా ?

అధ్యాపక వృత్తికే కళంకం తెచ్చిన ఇద్దరు అధ్యాపకులు కటకటాల పాలైన ఘటన కర్ణాటకలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లా మూడుబిదిరెలోని ఓ కళాశాలలో నరేంద్ర అనే అధ్యాపకుడు పని చేస్తున్నాడు. పాఠ్యాంశాల సందేహాలు తీర్చే నెపంతో ఓ విద్యార్థిని(19)తో నరేంద్ర తరచు ఫోన్లో మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నరేంద్ర, మరో అధ్యాపకుడు సందీప్ ఇటీవల కళాశాల పని మీద బెంగళూరు వెళ్దామని చెప్పి ఆ విద్యార్థినిని తీసుకువెళ్లారు. బెంగుళూరులో ముగ్గురూ సందీప్ స్నేహితుడైన అనూప్ గదిలో దిగారు. సందీప్ గది బయటకు వెళ్లిన సమయంలో నరేంద్ర ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వచ్చిన సందీప్.. తాను అంతా వీడియో తీశానని బెదిరించి.. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దంటూ హెచ్చరించి వారు ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ సమయంలో అనూప్ రూమ్‌కు వచ్చి విద్యార్థిని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన విద్యార్థిని జరిగిన విషయం బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని, బెంగళూరు ఎందుకు వెళ్లావని తల్లిదండ్రులు మందలిస్తారని, తోటి విద్యార్థినులు అవహేళన చేస్తారని భావించి సైలెంట్‌గా ఉంది. కొన్ని రోజులకు విద్యార్థిని కళాశాలకు వెళ్తుండగా.. మళ్లీ ఈ అధ్యాపకులు వేధింపులు మొదలు పెట్టటంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలికి ఫిర్యాదు చేసింది. కమిషన్ సూచనలతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అధ్యాపకులు గతంలోనూ కొందరిపై అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com