Crime News: వర్క్‌ఫ్రమ్ హోమ్ తెచ్చిన తంటా.. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య

Crime News: భార్యలను వేధించే భర్తలే ఉంటారనుకుంటే పొరపాటే.. అక్కడక్కడా కొందరు మహిళలు కూడా భర్తలను రాచిరంపాన పెడుతుంటారు. సంసారం సజావుగా సాగాలంటే ఇద్దరూ ఒకరి మాటలకు ఒకరు విలువిస్తూ, సర్ధుకుపోతే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నా సమస్యలను పరిష్కరించుకోలేక పోతున్నారు. సామరస్యంగా మాట్లాడుకోలేకపోతున్నారు.. తీగతెగే వరకు లాగుతున్నారు.. భార్యాభర్తల మధ్యలోకి మూడోవ్యక్తి ప్రవేశం. దాంతో ఆ కాపురg ముణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది.
భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామంలో సాప్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కొండా రాకేష్ (28) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి నిహారిక (24)తో వివాహమైంది. కొద్ది నెలలపాటు వారి సంసారం సజావుగానే సాగింది.
అయితే రాకేష్ గ్రామంలోనే ఉంటూ వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. కానీ భార్య నిహారికకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. హైదరాబాద్ వెళ్దామని భర్తతో చెబుతుండేది. ఆఫీసుకు రమ్మన్నప్పుడు వెళ్లొచ్చు.. ఇప్పుడే ఎందుకు అని అంటూ ఉండేవాడు. ఇదే విషయమై భార్యాభర్తలమధ్య గొడవలు తలెత్తడంతో నిహారిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో నిహారిక అయిదు నెలల గర్భవతి.
కొద్ది రోజుల క్రితం ఆమె భర్త రాకేష్‌కు వీడియో కాల్ చేసి చనిపొమ్మని, అప్పుడే తాను మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం, అత్తమామలు సూటిపోటి మాటలు అనడంతో మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో రాకేష్ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు అందిన సమాచారం ప్రకారం మృతుడి భార్యతో పాటు, అత్తమామ అరుణ, శంకర్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com